- ఇళ్లలో, ఆలయాల్లో 25 వేల టన్నుల పసిడి
- కుటుంబాల వద్ద రూ.425 లక్షల కోట్ల విలువైన బంగారం
న్యూఢిల్లీ: ఇండ్లు, ఆలయాల్లోని బంగారాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను మొదలుపెట్టింది. దీంతో ప్రభుత్వంతోపాటు నగల వ్యాపారులకు, ప్రజలకు మేలు జరుగుతుంది. బంగారాన్ని డాలర్లలో కొనడంతో విదేశీ మారకద్రవ్యం పెద్ద ఎత్తున ఖర్చవుతోంది. ద్రవ్యలోటూ పెరుగుతోంది. మరోవైపు ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉన్న బంగారం విలువ రికార్డు స్థాయికి చేరింది.
దీనిని మార్కెట్లోకి తేవడానికి గోల్డ్ డిపాజిట్ స్కీమ్(జీఎంఎస్)ను అమలు చేయనున్నారు. దీంట్లో నగల వ్యాపారులను భాగస్వామ్యం చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఏటా కొత్తగా బంగారాన్ని దిగుమతి చేసుకోకుండా, ఇళ్లలో, దేవాలయాలలో ఉన్న బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం జీఎంఎస్ ప్రధాన లక్ష్యం.
భారీగా బంగారం నిల్వలు
భారతదేశంలో ప్రైవేట్ బంగారం నిల్వలు భారీగా ఉన్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం, భారతీయ కుటుంబాలు, దేవాలయాల వద్ద 25 వేల టన్నుల బంగారం ఉంది. కొన్ని పరిశ్రమల అంచనాల ప్రకారం ఇది 30 వేల టన్నుల నుంచి 50 వేల టన్నుల వరకు కూడా ఉండొచ్చు. గత రెండేళ్లలో బంగారం ధరలు పెరగడంతో ఈ నిల్వలు మరింత పెరిగాయి. కోటక్ ఇన్స్టిట్యూషనల్
ఈక్విటీస్ అంచనా ప్రకారం, ఈ ఏడాది నాటికి ఇండ్లలోని బంగారం విలువ సుమారు రూ.425 లక్షల కోట్లు ఉంది. ఇది జీడీపీలో 125 శాతానికి సమానం. మోర్గాన్ స్టాన్లీ దీని విలువను రూ.323 లక్షల కోట్లుగా, యూబీఎస్ సంస్థ రూ.382.5 లక్షల కోట్లుగా పేర్కొన్నాయి. ఈ సంపద ఆర్థిక వ్యవస్థ వెలుపల ఉండటం వల్ల ఎటువంటి ఆర్థిక ప్రయోజనం కలగడం లేదని నిపుణులు చెబుతున్నారు.
పథకం అమలు ఇలా...
వినియోగదారులు తమ ఇళ్లలో ఉన్న పాత బంగారాన్ని గుర్తింపు పొందిన దుకాణాలకు తీసుకువెళ్లాలి. అక్కడ బంగారం స్వచ్ఛతను, బరువును అత్యాధునిక యంత్రాల ద్వారా పరీక్షించి కచ్చిత విలువను నిర్ధారిస్తారు. ఆ తర్వాత వ్యాపారులు వినియోగదారులకు అధికారిక రశీదు ఇస్తారు. ఈ బంగారాన్ని బ్యాంకులకు బదిలీ చేసి వినియోగదారుల పేరుతో జీఎంఎస్ ఖాతా ప్రారంభిస్తారు. డిపాజిట్ చేసిన బంగారంపై ప్రభుత్వం పన్ను లేని వడ్డీని అందిస్తుంది.
కాలపరిమితి ముగిసిన తర్వాత అసలు బంగారాన్ని కడ్డీల రూపంలో లేదా ఆ సమయానికి ఉన్న మార్కెట్ ధర ప్రకారం నగదు రూపంలో వెనక్కి తీసుకోవచ్చు. కాగా, బంగారం వినియోగాన్ని తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది మే నెలలో ప్రజలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
