‘కల్ -డి -సాక్’ నుంచి  సీఎం వరకు... రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్ళు..

‘కల్ -డి -సాక్’ నుంచి  సీఎం వరకు... రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్ళు..

దారిలేని చోట  దారిని సృష్టించే నాయకత్వమే చరిత్రను తిరగరాస్తుంది.  ‘కల్-డి-సాక్’ అనేది ఫ్రెంచ్ పదం. ముందుకు దారి లేని వీధి అని అర్థం.  అక్కడికి చేరుకున్న చాలామంది వెనక్కి తిరుగుతారు.  కొందరు అక్కడే ఆగిపోతారు. కానీ అసాధారణ  నాయకులు మాత్రం అక్కడితో ప్రయాణాన్ని ముగించరు.  కొత్త దారిని వెతుకుతారు. అవసరమైతే  కొత్త దారినే నిర్మిస్తారు.  చరిత్రలో నిలిచిపోయే నాయకులు అలాంటివారే.  

ఎంతటి సంక్షోభమైనా, ఎంతటి ప్రతికూల పరిస్థితులైనా వెనక్కి తగ్గకుండా ఎదుర్కొనే ధైర్యం.  దారి మూసుకుపోయిందని బాధపడకుండా కొత్త దారిని సృష్టించే నాయకత్వం.  ప్రపంచాన్ని మార్చిన నాయకులందరిలోనూ ఈ లక్షణం కనిపిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణాన్ని పరిశీలించినప్పుడు కూడా ఇదే భావజాలం కనిపిస్తుంది. 

ఇది ఇద్దరు నాయకులు సాధించిన విజయాలను పోల్చడం కాదు.  ప్రతికూల పరిస్థితులను అవకాశాలుగా మార్చే నాయకత్వ లక్షణాలను గుర్తించడం మాత్రమే. 1969  నవంబర్ 8న  ఉమ్మడి  మహబూబ్‌‌నగర్  జిల్లా  కొండారెడ్డిపల్లి  గ్రామంలో జన్మించిన రేవంత్ రెడ్డి చిన్ననాటి నుంచే చురుకుదనం,  సామాజిక స్పృహ,  నాయకత్వ లక్షణాలను అలవరుచుకున్నాడు.  విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా  ప్రజా జీవితానికి తొలి పునాది పడింది.  పదవులు ఆయనను వెతుక్కుంటూ రాలేదు.  

ప్రజల మధ్య నిరంతర పోరాటమే  ప్రతి మెట్టును నిర్మించింది. 2006లో జడ్పీటీసీ సభ్యుడిగా ప్రజాప్రతినిధి జీవితాన్ని  ప్రారంభించిన ఆయన,  ఆ తర్వాత ఎమ్మెల్సీగా,  కొడంగల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా, 2019లో  మల్కాజిగిరి లోక్‌‌సభ సభ్యుడిగా, 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా, 2023లో తెలంగాణ  రెండో ముఖ్యమంత్రిగా ఎదిగారు. 

తెలంగాణలో ఒక మాట చెబుతారు.. 

‘పడితే పడు..  లేచేది మాత్రం గట్టిగా లేవాలి’.  రేవంత్​రెడ్డి  రాజకీయ  ప్రయాణం ఈ మాటకు సజీవ ఉదాహరణగా కనిపిస్తుంది. నాయకత్వం అనేది ఎప్పుడూ గెలవడంలో కాదు. పడిపోయిన తర్వాత మళ్లీ నిలబడటంలో ఉంది. అయితే ఒక పోరాట నాయకుడిని చరిత్రలో నిలబెట్టేది పోరాటం మాత్రమే కాదు పాలన కూడా.  ఇక్కడి నుంచే అసలు పరీక్ష మొదలవుతుంది. ప్రజలు ప్రసంగాలను ఎక్కువకాలం గుర్తుంచుకోరు. ఫలితాలను మాత్రం తరాలు గుర్తుంచుకుంటాయి. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి బాగా అర్థం చేసుకున్న నాయకుడిగా కనిపిస్తాడు. అందుకే ఆయన దృష్టి కేవలం ఎన్నికల విజయాలపైనే కాకుండా, రేపటి తెలంగాణ నిర్మాణంపై  కేంద్రీకృతమైందనే భావన కలుగుతోంది.

హైదరాబాద్‌‌ను ప్రపంచస్థాయి పెట్టుబడుల కేంద్రంగా మరింత బలోపేతం చేయడం, మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ, మూసీనది పునరుజ్జీవనం, వరంగల్ విమానాశ్రయం, ఆధునిక మౌలిక వసతులు, పారిశ్రామిక కారిడార్లు, గ్లోబల్ కంపెనీలను ఆకర్షించడం వంటి కార్యక్రమాలు ఆయన దీర్ఘకాలిక అభివృద్ధి దృష్టిని ప్రతిబింబిస్తున్నాయి. 

ఆర్థికవృద్ధితోపాటు సమ్మిళిత అభివృద్ధి 

రైతు సంక్షేమం, యువతకు ఉపాధి,  ప్రపంచ పెట్టుబడుల ఆకర్షణ, అత్యాధునిక నగరాభివృద్ధి, నాణ్యమైన విద్య. ఈ ఐదు స్తంభాలపై తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం ఆయన ఆలోచనల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక ప్రభుత్వం ఐదేళ్ల కోసం పనిచేయవచ్చు. కానీ ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు ఇరవై, ముప్పై సంవత్సరాల తర్వాతి తరాల కోసం పునాదులు వేస్తాడు.  

జాతీయ రాజకీయాల్లో రాహుల్​ గాంధీ తరచూ ప్రస్తావించే సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, యువతకు శక్తిమంతమైన భవిష్యత్తు, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, ఆర్థికవృద్ధితోపాటు సమ్మిళిత అభివృద్ధి వంటి భావజాలాన్ని తెలంగాణలో పాలనా కార్యక్రమాల రూపంలో ఆచరణలో చూపించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అభివృద్ధి కొద్దిమందికే పరిమితం కాకుండా సమాజంలోని ప్రతి వర్గానికీ చేరాలని కాంగ్రెస్ భావజాలం చెబుతుంది. 

దేశానికి  అభివృద్ధి దిక్సూచిగా తెలంగాణ 

లీ క్వాన్ యూ సింగపూర్‌‌ను ప్రపంచ పటంలో నిలబెట్టింది కేవలం రాజకీయ చాతుర్యం వల్ల కాదు. దూరదృష్టి,  సమర్థవంతమైన పరిపాలన, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించే వాతావరణం ఇవే సింగపూర్‌‌ను ప్రపంచంలో ఆదర్శంగా నిలబెట్టాయి. సహజ వనరులు లేకపోయినా, మానవ వనరులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లగలిగితే ఒక రాష్ట్రం లేదా దేశం ఎంత ఎత్తుకు ఎదగగలదో సింగపూర్ నిరూపించింది. తెలంగాణ కూడా అలాంటి అవకాశాల అంచున నిలబడి ఉంది. 

ప్రభుత్వ పాఠశాలలను నాణ్యతా ప్రమాణాలతో తీర్చిదిద్దడం, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ భావనను విస్తరించడం,  ప్రభుత్వ విద్యను ప్రపంచస్థాయి పోటీకి సిద్ధం చేయడం  రాబోయే తరాల భవిష్యత్తుపై పెట్టుబడి. ఐటీ రంగంలో హైదరాబాద్ ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఇప్పుడు దానిని కృత్రిమ మేధస్సు, డీప్‌‌టెక్, బయోటెక్నాలజీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, స్టార్టప్‌‌లు, ప్రపంచస్థాయి విద్య, ఆధునిక పట్టణ జీవన విధానానికి కేంద్రంగా తీర్చిదిద్దగలిగితే, వచ్చే రెండు దశాబ్దాల్లో తెలంగాణ దేశానికి అభివృద్ధి దిక్సూచిగా నిలిచే అవకాశం ఉంది. 

ఆ దిశగా ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం, పరిశ్రమల విస్తరణ వంటి కార్యక్రమాలను భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి బ్లూప్రింట్‌‌గా చూడాల్సిన అవసరం ఉంది.తెలంగాణ భాషలో ఒక మాట ఉంది..‘జిగర్ ఉన్నోడికి జయం ఆలస్యమవొచ్చు.  కానీ ఆగదు’.  రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఈ మాటను గుర్తు చేస్తుంది. ఆయన ఎదుగుదలలో వేగం కంటే నిలకడ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి ఎదురుదెబ్బను మరో మెట్టుగా మార్చుకుంటూ ముందుకు సాగిన తీరే ఆయన రాజకీయ వ్యక్తిత్వాన్ని నిర్మించింది.  

అయితే, చరిత్ర నాయకులను కేవలం పోరాటాల ఆధారంగా కాదు.  ఫలితాల ఆధారంగానే తీర్పు చెబుతుంది. ఎన్నికలు గెలవడం ఒక విజయమైతే, ప్రజల జీవితాలను మార్చడం మరింత గొప్ప విజయం.  ‘కల్- డి- సాక్’ అనేది ఒక వీధి ముగింపు మాత్రమే. దూరదృష్టి ఉన్న నాయకుడికి అది కొత్త ప్రయాణానికి ఆరంభం. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఇప్పటివరకు ఆ విషయాన్ని నిరూపించింది. 

ఇక ఆయన పాలన తెలంగాణను ప్రపంచ పెట్టుబడులు, నాణ్యమైన విద్య, ఆధునిక పట్టణాభివృద్ధి, సమ్మిళిత సంక్షేమం, ఉన్నత జీవన ప్రమాణాల వైపు నడిపించగలిగితే, “కల్- డి- సాక్ నుంచి సీఎం వరకు” అనే ఈ ప్రయాణం ఒక వ్యక్తి విజయగాథగా మాత్రమే కాకుండా, తెలంగాణ పరివర్తనకు నాందిగా చరిత్రలో నిలిచిపోతుంది.

ఓటములే  విజయాలకు పునాది

కేవలం పదిహేడు సంవత్సరాల్లో స్థానిక ప్రజాప్రతినిధి స్థాయి నుంచి రాష్ట్ర అత్యున్నత పదవికి చేరుకోవడం భారత రాజకీయాల్లో అరుదుగా కనిపించే ప్రయాణం. ఈ ప్రయాణం ఎక్కడా పూలబాట కాదు. విమర్శలు ఎదురయ్యాయి. కేసులు నమోదయ్యాయి. వ్యక్తిగత దాడులు జరిగాయి. రాజకీయంగా ఒంటరిని చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. ఎన్నికల్లో పరాజయాన్ని కూడా చవిచూశారు. కానీ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. 

రాజకీయాల్లో కొందరు అనుకూల గాలులతో ఎదుగుతారు.  మరికొందరు ఎదురు గాలినే తమ బలంగా మార్చుకుంటారు.  రెండో రకం నాయకులే చరిత్రలో నిలుస్తారు. కొడంగల్‌‌లో ఎదురైన ఓటమిని చాలామంది రాజకీయ ముగింపుగా భావించారు. కానీ అదే ఓటమిని ఆయన మల్కాజిగిరి విజయానికి పునాదిగా మార్చుకున్నారు. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం, టీపీసీసీ బాధ్యతలు, ప్రజా ఉద్యమాలు, చివరకు ముఖ్యమంత్రి పదవి వరకు సాగిన ప్రయాణం ఒక విషయాన్ని స్పష్టం చేసింది.  కొన్ని ఓటములు అంతిమం కావు. అవే గొప్ప విజయాలకు పునాది అవుతాయి.

- వెలిచాల రాజేందర్ రావు
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,కరీంనగర్