హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 117 సీట్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన అంచనా వేశారు. కాంగ్రెస్ మళ్లీ పవర్లోకి రావాలంటే గౌడ కులస్తుల సహకారం కావాలని కోరారు. బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర మంగళవారం (ఆగస్ట్ 18) ఆయన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్యాంక్ బండ్ మీద కాకుండా వేరే చోట సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు.. కానీ నగరం నడిబొడ్డున ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహం ఉండాలని తానే సూచించానని తెలిపారు. ఇందులో భాగంగానే ట్యాంక్ బండ్పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పుడు ట్యాంక్ బండ్ కు వచ్చే ప్రతిఒక్కరూ సర్వాయి పాపన్న విగ్రహం చూసి ఆయన చరిత్ర తెలుసుకుంటారని అన్నారు.
బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన గొప్ప వీరుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని.. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ బహుజనుల అభిప్రాయాన్ని పట్టించుకోలేదన్నారు. బహుజనుల కోరిక మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఇది బహుజనుల తెలంగాణ అని అన్నారు. ఇందిరమ్మ పాలన సామాజిక న్యాయం, సమానమైన అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం మనకు బర్రెలు, గొర్రెలు ఇచ్చింది. గొర్రెలు, బర్రెలు మనకు.. వాళ్ల పిల్లలేమో రాజ్యలేలాలా అని నిలదీశారు. చదవాలనే ఆకాంక్ష ఉన్న పేదరికం అడ్డొచ్చేది.. అయినప్పటికీ కుల వృత్తులు చేసుకుంటూనే పిల్లలను చదివించారన్నారు. పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత నాదని.. ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివించే బాధ్యత నాదన్నారు. మన పిల్లలు బాగుపడాలంటే చదువు ఒక్కటే పరిష్కారమని పేర్కొన్నారు. కష్టమైనా.. నష్టమైనా పిల్లలను ప్రభుత్వ బడులకు పంపాలని సూచించారు.
