జీవితంలో ప్రతీ ఒక్కరూ లక్ష్యాల్ని నిర్దేశించుకుంటారు. అలుపెరగకుండా పోరాడే లక్షణమే వారిని విజయతీరాలకు చేరుస్తుంది. లక్ష్య ఛేదనలో కొంతమందే విజేతలుగా నిలుస్తారు. ఈ విజేతలకు పోరాడేతత్వం, సమస్యలకు బెదరని తీరు, స్థితప్రజ్ఞత, అవకాశాల్ని అందిపుచ్చుకోవటం వంటి ప్రత్యేక గుణాల్ని కలిగి ఉంటారు. వీరిలో అగ్రగణ్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఇంకా చెప్పాలంటే భయం ఏ కోశానా లేకపోవడం, అధికారం కన్నా ప్రజాపక్షం వహించడం, నాటి నుంచి నేటిదాకా అదే మంచి ఉన్నత వ్యక్తిత్వంతో ఉండడం ఆయన నైజం. నిరాడంబరత. ప్రజల కోసం నిరంతరం తపన, అనుకున్న కార్యాన్ని సాధించే కార్యదక్షత, అంకితభావం, పట్టుదల ఉన్న నాయకుడు. ఆయనది వైఫల్యాలకు వెన్నుచూపని ధీరత్వం. పరిపూర్ణమైన రాజకీయ, సామాజిక స్ఫూర్తి ఉన్న నేత సీఎం రేవంత్ రెడ్డి ఇతరులకు స్ఫూర్తి.
జులై 4, 2006 తెలంగాణ రాజకీయ చరిత్రలో ప్రత్యేకత కలిగిన రోజు. తెలంగాణ నేడు సాధిస్తున్న అనితర సాధ్యమైన విజయాలకు పునాదిపడిన రోజు. ఆ రోజే ప్రజాప్రతినిధిగా తొలి బాధ్యతల్ని చేబూనిన రోజు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ జడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి పార్టీలకతీతంగా స్వతంత్రంగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు రేవంత్ రెడ్డి. వారి కుటుంబంలో ముఖ్యమంత్రులో, మంత్రులో, ఎంపీ, ఎమ్మెల్యేలో ఎవరూ లేరు.
కొండారెడ్డిపల్లి వాస్తవ్యులైన తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, రామచంద్రమ్మలది వ్యవసాయ కుటుంబం. అప్పటికి తనతోపాటు ఏడుగురు తోబుట్టువులెవరూ రాజకీయాల్లో లేరు. అలుపెరగని శ్రమ ఆయన్ని 2006 జులై 4న జడ్పీటీసీగా తొలిపీఠంపై కూర్చోబెట్టాయి. ఆయన ఏ పార్టీ పై ఆధారపడకుండా జెడ్పీటీసీ, ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా గెలిచి తనదైన రాజకీయ శక్తిని చాటుకున్నారు.
స్వతంత్ర జడ్పీటీసీగా..
నాడు ఉమ్మడి జడ్పీలకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. మంత్రి స్థాయి అధికారాలు ఉండేవి. అందుకే జడ్పీటీసీ స్థానాలపై స్పష్టమైన ఆధిపత్యం కోసం ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమించేవి, ఎదుటి వర్గాన్ని నయానో, భయానో లొంగదీసుకోవడానికి ప్రయత్నాలు జరిగేవి. అయినా ఒక ఇండిపెండెంట్‌గా మిడ్జిల్ ప్రజల మనసును గెలిచాడు. ఇలా తొలి అడుగే ప్రజాపక్షం వహిస్తూ ప్రతిపక్షంలో నిలబడ్డాడు.
ఇండిపెండెంట్ ఎంఎల్సీగా గెలుపు
2007లో ఎన్నో పార్టీలు ఆహ్వానించి తమ అభ్యర్థిగా మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నిలబెట్టాలని చూసినా... ప్రజాసేవ చేయాలనే దృఢసంకల్పం, చేతల్లో చిత్తశుద్ధి ఉంటే చాలని తిరిగి ఇండిపెండెంట్‌గానే ఎమ్మెల్సీగా బరిలో నిలిచారు. సాధారణ ప్రజలు పాల్గొనే ఎన్నికల్లోనే ఎన్నో ఎత్తులు, చిత్తులుంటాయి. అటువంటిది ఏకంగా ప్రజా ప్రతినిధులే ఓటర్లుగా ఉంటే ఆ బరి ఇంకెంత రసవత్తరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
హేమాహేమీలైన అభ్యర్థులు, అధికారం చేతులో ఉన్న పార్టీలు, అంగ, అర్థబలంతో ఉన్న సమరంలో సైతం భయం లేకుండా ఎన్నికల బరిలో నిలిచాడు రేవంత్ రెడ్డి. ఆనాడే యావత్ రాష్ట్రం ఆశ్చర్యపోయి చూసేలా ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలిచి పెద్దల సభలో అడుగుపెట్టాడు. 2007 ఎమ్మెల్సీ ఘనవిజయం తర్వాత సైతం అధికార పార్టీలో కాకుండా ప్రతిపక్షంలోనే ఉండాలని నిర్ణయించుకొని టీడీపీలో చేరాడు. సమస్యలపై సంపూర్ణ అవగాహనతో అశేషమైన తన వాగ్దాటితో పార్టీ క్యాడర్నీ, లీడర్నీ మెప్పించి ఒక్కో మెట్టు పైకెక్కుతూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
2009లో కొడంగల్ ఎమ్మెల్యేగా..
2009 ఎన్నికల్లో కొడంగల్ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించాడు. రాజకీయాల్లో రాటుదేలిన పట్టుదలే ఆయన్ని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుణ్ని చేశాయి. 2014 ఎన్నికల్లో అజేయుడిని చేశాయి. నిజానికి రాష్ట్రంలో నాడున్న వాతావరణంలో టీడీపీ అభ్యర్థులు నిలబడడమే కష్టం అనుకున్నచోట, పార్టీ ఏదైనా బలమైన లీడర్‌ను క్యాడర్, ప్రజలు వదులుకోరని నిరూపించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రజాస్వామ్యం పరిహాసమయ్యేలా టీడీఎల్పీ మొత్తం నాటి అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి ఆ పార్టీలో చేరిపోయినా... రేవంత్ రెడ్డి మాత్రం అధికారం కోసం తాపత్రయపడలేదు.
పాలక పక్షం తప్పుల్ని ఎత్తి చూపుతూ, ప్రతిపక్షంలోనే ఉండిపోయాడు. ఒంటరిని చేసి బెదిరించాలని చూసినా ఏమాత్రం అధైర్య పడకుండా తన లక్ష్యసాధనకు మరింత తెగువతో ముందుకు సాగుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. వచ్చిన తెలంగాణలో రేవంత్ రెడ్డి పదేండ్లు పోషించిన బలమైన ప్రతిపక్ష పాత్రనే ఆయనను ఈరోజు ముఖ్యమంత్రిని చేసింది.
గడీల పాలనపై గళం
యావత్ తెలంగాణ సమాజం కదిలి పోరాడి సాధించుకున్న తెలంగాణలో దానికి వ్యతిరేకంగా సాగుతున్న గడీల పాలనపై గళమెత్తాడు. హేమాహేమీలు ఉండే కాంగ్రెస్‌లో తన పనితీరుతో పెద్దలకు తలలో నాలుకలా మారాడు. దాని ఫలితమే 2018 ఎన్నికలకు ముందు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డిని నిలిపింది. ఇలా ఓటమెరగని పోరాటాలు సాగిస్తున్న రేవంత్ రెడ్డిపై అక్కసు పెరిగిన పార్టీలు ఆయనపై మరింతగా ఫోకస్ పెట్టాయి, వ్యక్తిత్వ హననం మొదలు ఆర్థిక, అంగబలాలపై విపరీతమైన దాడులు చేశాయి.
రేవంత్ రెడ్డిని నిలువరించకపోతే తమకు భవిష్యత్తు లేదనేలా భయపెట్టాయి. దాని ఫలితమే 2018 ఎన్నికల్లో ఓటమి, మరొకరైతే కుంగిపోయేవారేమో. కానీ గెలుపోటముల కోసం కాదు ప్రజాసేవకోసమే రాజకీయాలు అని నమ్మాడు. కనుకనే తన పనిని తాను చేసుకుపోయాడు.
గెలుపోటములకు ఏనాడూ ప్రభావితంకాలే
రేవంత్ రెడ్డిని దేశంలోనే అతి పెద్దదైన పార్లమెంట్ స్థానం మల్కాజిగిరి ఎంపీని చేశారు ప్రజలు. ఆ తర్వాత అదే స్ఫూర్తితో కాంగ్రెస్ కార్యకర్తల్లో విశ్వాసం నింపుతూ, ప్రజాకంటక పాలనపై విసిగిన ప్రజలకు ఆశాదీపంలా నిలబడి 2023 ఎన్నికల్లో టీం లీడర్‌గా కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చాడు. ఈ ప్రజాతీర్పుతో తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని చేపట్టాడు. సీఎంగా ఎన్నికైన దగ్గరి నుంచి ఎలాంటి భేషజాలు లేకుండా, ప్రతిపక్ష నేత అనుభవాల్ని రాష్ట్రాభివృద్ధికి వాడుకోవాలని సంకల్పించాడు. కానీ అధికారం కోల్పోయామనే అక్కసుతో ఆ మాటల్ని పెడచెవిన పెడుతూ ఫాంహౌస్‌కే పరిమితమైన వాళ్లతో పోల్చుకుంటే.. రేవంత్ రెడ్డి ప్రజాసేవ ఎలా చేస్తున్నాడో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
వ్యక్తిత్వమే బలం
గెలుపోటములకు, ఆశ నిరాశలకు ప్రభావితం కాని అత్యున్నత వ్యక్తిత్వం కాబట్టే రేవంత్ రెడ్డి తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. ఏ వ్యక్తిత్వంతో ప్రయాణం ప్రారంభించారో ఇప్పటికీ అదే వ్యక్తిత్వంతో నడుస్తున్న ఆయన జీవితం మనకు ఇచ్చే స్ఫూర్తి కూడా ఇదే.
అవకాశవాదం లేకుండా, కుళ్లు, కుట్రలు లేకుండా మంచి చేయాలనే బలమైన సంకల్పం ఉంటే ఫలితం ఎలా పాదాక్రాంతమవుతుందో 20 ఏళ్ల ఆయన రాజకీయ ప్రస్థానం సాధించిన విజయం మనకు నేర్పుతుంది. ఆనాటి తొలి విజయం 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా... ఎక్కడ తొలి విజయం వరించిందో అదే నేలపై కృతజ్ణతా సభను నిర్వహించుకోవటం ఆయన కమిట్‌మెంట్‌కు నిదర్శనం.
- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి
సీఈవో, టిసాట్ నెట్‌వర్క్
