రోస్టర్ పాయింట్లు సవరించకపోతే ఆగస్టు 11 నుంచి ఉద్యమిస్తాం : జి.చెన్నయ్య

రోస్టర్ పాయింట్లు సవరించకపోతే  ఆగస్టు 11 నుంచి ఉద్యమిస్తాం : జి.చెన్నయ్య
  •     మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య వార్నింగ్​
  •     రోస్టర్ విధానం గురించి మంత్రి వివేక్ వెంకటస్వామి ఒక్కరే మాట్లాడుతున్నారని వెల్లడి

అబిడ్స్, వెలుగు: మాలలకు విద్య , ఉద్యోగ అవకాశాలు దక్కకుండా ఏర్పాటు చేసిన రోస్టర్ పాయింట్లను సవరించాలని, లేదంటే ఆగస్టు 11 నుంచి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదర్ గూడలోని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణలో ఐదు శాతం కేటాయించిన గ్రూప్–3లోని మాల, దాని అనుబంధ కులాలకు కొన్ని నోటిఫికేషన్స్​లో సున్నా పోస్టులు, మరికొన్ని నోటిఫికేషన్స్​లో రెండు శాతంలోపు ఉద్యోగాలు దక్కుతున్నాయన్నారు. 

దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రోస్టర్ విధానాన్ని సరిచేయాలని డిమాండ్​చేశారు. ఈ రోస్టర్ విధానంలోని లోపాలపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఒక్కరు మాత్రమే మాట్లాడుతున్నారని, మిగతా మాల సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.  మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో రోస్టర్ పాయింట్ల విధానంలో ప్రభుత్వం మాలలకు అన్యాయం చేసిందన్నారు. 

తక్షణమే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరు లక్ష్మణ్, దామోదర రాజనర్సింహ సబ్ కమిటీ సభ్యులందరూ స్పందించి మాలలకు న్యాయం చేయాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బైండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ నాటి నుంచి కాంగ్రెస్ కు మాలలు అండగా ఉన్నారని, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి మాలల కృషి ఎంతో ఉందని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి ఈ రోస్టర్ విధానంలో జరిగిన అన్యాయాన్ని సవరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మాల మహానాడు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.సరళ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బేగరీ మహేశ్, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శులు పి.జయకుమార్, మరిపల్లి శ్రీకాంత్, మన్నే రాకేశ్, జి.రమేశ్, పి.భరత్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.