మహబూబాబాద్/ మహబూబాబాద్ అర్బన్/ రేగొండ/ ఎల్కతుర్తి/ ధర్మసాగర్, వెలుగు: భూ సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతిలో సర్వే చేపట్టిందని ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల నిర్వహిస్తున్న రీ సర్వేపై శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే చేయనున్నట్లు జిల్లా ఏడీఎల్ఆర్ శ్రీనివాసులు తెలిపారు.
మహబూబాబాద్ మండలం జంగిలిగొండ గ్రామంలో నిర్వహించిన సదస్సులో ఎమ్మెల్యే మురళీనాయక్ పాల్గొని మాట్లాడుతూ తొలివిడతలో మండలంలోని జంగిలిగొండ, సింగారం, పర్వతగిరి గ్రామాలను రీ సర్వే కోసం ఎంపిక చేసినట్లు చెప్పారు. అనంతరం ఆయన మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. విధులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం లింగాల గ్రామంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అవగాహన కల్పించారు.
అనంతరం కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో అడిషనల్ కలెక్టర్ ఎన్.రవి మాట్లాడుతూ భూ సమస్యలు ఉన్న రైతులు పాసు పుస్తకాలతో వస్తే రీ సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తామని చెప్పారు. అంతకుముందు ఆయన ధర్మసాగర్ మండలం ముప్పారం కస్తూర్భా స్కూల్‌ను సర్పంచ్ గుంటుపల్లి రేణుకతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు.
