- కాంగ్రెస్ సర్కారు చేసింది రూ.4.50 లక్షల కోట్లు: హరీశ్‌రావు
- తాము పూటకో అంకె మార్చి చెప్పడం లేదని కామెంట్
- మంత్రి జూపల్లి కృష్ణారావుకు లేఖ
హైదరాబాద్/పటాన్‌చెరు, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై సీఎం, మంత్రులు పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలు, గ్యారెంటీ ఇచ్చి ప్రభుత్వం చెల్లించే రుణాలు మొత్తం కలిపితే రూ.4.17 లక్షల కోట్లు మాత్రమేనని అసెంబ్లీలో చెప్పానని, ఆ లెక్కలకు కట్టుబడి ఉంటానని అన్నారు. ఈ విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని అసెంబ్లీలోనే స్పష్టంగా ప్రకటించానని పేర్కొన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో హరీశ్‌రావు పవర్పాయింట్ప్రజెంటేషన్ఇచ్చారు.
అలాగే, మంత్రి జూపల్లి కృష్ణారావుకు లేఖ రాశారు. లేఖతోపాటు పలు వీడియోలను వాట్సాప్‌లో మంత్రికి పంపించారు. ‘‘ఈరోజు మీరు రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు చేసిన అప్పు రూ.1,77,058 కోట్లు అని పేర్కొన్నారు. కానీ, ఆర్‌బీఐ లెక్కల ప్రకారం 2026 జూన్ 30 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు రూ.1,86,067 కోట్లు. 2026 మార్చి 18న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మీ ప్రభుత్వం తెచ్చిన ఎఫ్ఆర్బీఎం, అన్ని రకాల అప్పు కలిపి రూ.3,47,294 కోట్లు అని స్వయంగా ప్రకటించారు. మీలాగా మేం మాట మార్చడం లేదు. పూటకో తీరుగా అంకెలు మార్చి చెప్పడం లేదు.
మేం చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నాం. ఇప్పటికీ మా లెక్కల ప్రకారం.. వివిధ మార్గాల ద్వారా మీ ప్రభుత్వం తీసుకున్న అప్పు సుమారు రూ.4.5 లక్షల కోట్లు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పుపై నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో.. మీ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన వీడియో.. అలాగే, మీ అప్పులకు సంబంధించిన ఆర్‌బీఐ అధికారిక లెక్కలను మీ వాట్సాప్‌కు పంపిస్తున్నాను. వాటిని ఒకసారి పరిశీలించి, వాస్తవాలు తెలుసుకోండి. ఇకనైనా అప్పుల విషయంలో తప్పుడు ప్రచారం మానుకోవాలి’’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. అప్పులపై చర్చకొస్తానన్న మంత్రి జూపల్లి కృష్ణారావు పదేపదే వేదికలు మారుస్తూ తప్పించుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌కు వస్తానని చెప్పి రాలేదని, అనంతరం గన్‌పార్క్, తర్వాత సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ పేర్లు చెప్పారని విమర్శించారు. తప్పుడు లెక్కలు చెప్తున్న జూపల్లి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అప్పుల అంశంపై ఎప్పుడైనా.. ఎక్కడైనా తాను బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.
