- నాలాలు, చెరువులు, డ్రెయిన్ల శుద్ధికి బయో లేస్ టెక్నాలజీ
- సిటీ అంతా విస్తరించే యోచన
- వాటర్ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో నాలాలు, చెరువులు, డ్రెయిన్ల శుద్ధికి జపాన్‌కు చెందిన బయో-లేస్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు. పైలట్‌ప్రాజెక్టు కింద ఫతేనగర్‌లోని వాటర్ బోర్డు ఎస్టీపీ ప్రాంగణంలో వన్ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే)ని శుద్ధి చేస్తుండగా పనితీరును బోర్డు ఎండీ అశోక్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. జైకా , జపాన్ కే చెందిన టీబీఆర్ సంస్థ సహకారంతో ఈ ప్రాజెక్టును ఇండియాలోనే ఫస్ట్‌టైం నాలాల్లో ప్రవహిస్తున్న నీటిని శుద్ధి చేయడానికి వాడుతున్నారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ జపాన్‌లో ఇప్పటికే 400కు పైగా నదుల్లో ఈ టెక్నాలజీని వాడారని, మన సిటీలో పైలట్‌ప్రాజెక్టు కింద చేపట్టగా ఆశించిన ఫలితాలు వచ్చాయన్నారు.
ప్రస్తుతం పంపింగ్ ద్వారా శుద్ధి చేస్తున్నామని, భవిష్యత్తులో ఈ టెక్నాలజీని సిటీలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. భారీ భూవిస్తీర్ణం అవసరం లేదని, 50 శాతానికి పైగా కరెంట్ఆదా అవుతుందని, కెమికల్స్అవసరం లేకుండానే సహజ సూక్ష్మజీవుల ద్వారా శుద్ధీకరణ జరుగుతుందన్నారు. బురద ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గుతుందన్నారు.
పైలట్ ప్రాజెక్టులో భాగంగా సేంద్రియ కాలుష్యంలో 90 బీఓడీ (బయో కెమికల్ఆక్సిజన్డిమాండ్) శాతం, సస్పెండెడ్ సాలిడ్స్లో 85 శాతం తగ్గుదల నమోదైందని, దుర్వాసన తగ్గడంతో పాటు నీటిలో కరిగిన ఆక్సిజన్ స్థాయి మెరుగుపడిందని టీబీఆర్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. మూసీ, సరస్సులు, నదుల్లోకి చేరే నీటి నాణ్యత గణనీయంగా పెరిగిందని స్పష్టం చేశారు. బోర్డు సీజీఎమ్ సుజాత, ప్రాజెక్టు అధికారులు, జైకా ప్రతినిధులు, టీబీఆర్ సంస్థ సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
