సూర్యాపేట/గరిడేపల్లి, వెలుగు: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా కల్మలచెరువు గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులు ఇద్దరికి నిబంధనలకు విరుద్ధంగా వేల రూపాయలు లంచం తీసుకుని ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత జీపీఓ, రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్ లాగిన్ల ద్వారా మాత్రమే జరగాల్సిన ఈ అధికారిక ప్రక్రియ, నిబంధనలను పాటించకుండా ఎలా పూర్తయిందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల మండలంలో పంపిణీ చేసిన కల్యాణలక్ష్మి చెక్కుల విషయంలోనూ లబ్ధిదారుల నుంచి ఓ అధికారి ఒక్కొక్కరితో రూ.2 వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ అక్రమాలపై గతంలో జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి విచారణ జరగలేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై తహసీల్దార్ స్రవంతిని వివరణ కోరగా, జీపీఓ లాగిన్‌కు రాకుండా, తమ దృష్టికి రాకుండానే ఈ ఇన్కమ్ సర్టిఫికెట్లు ఎలా జారీ అయ్యాయో తెలియడం లేదని, దీనిపై కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
