హైదరాబాద్: కమాన్లు ఇక కళకళ...రిపేర్లకు రూ.11 కోట్లిచ్చిన సర్కారు

హైదరాబాద్: కమాన్లు ఇక కళకళ...రిపేర్లకు రూ.11 కోట్లిచ్చిన సర్కారు

హైదరాబాద్ సిటీ, వెలుగు : పాతబస్తీలోని ఎనిమిది చారిత్రక కమాన్ల (గేట్‌‌‌‌వేలు) పునరుద్ధరణ, రిపేర్ల కోసం రాష్ట్ర  ప్రభుత్వం రూ.11.86 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ప్రభుత్వం గురువారం జీవో 652 జారీ చేసింది. కుతుబ్‌‌‌‌షాహీ, ఆసఫ్‌‌‌‌జాహీ కాలంలో నిర్మించిన ఈ కమాన్లు చారిత్రక వారసత్వానికి ప్రతీకలుగా నిలిచాయని ప్రభుత్వం పేర్కొంది. కాలక్రమేణా ఇవి దెబ్బతినడంతో పాటు వర్షాకాలంలో ప్లాస్టర్ ఊడిపడుతూ ప్రజల భద్రతకు ముప్పుగా మారిన నేపథ్యంలో  పునరుద్ధరణ చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. 

రాణీగంజ్ కమాన్, షేక్ ఫైజ్ కమాన్, ఛత్తా బజార్ కమాన్, దివాన్ దేవుడి కమాన్-1,2, డబీర్‌‌‌‌పురా కమాన్, హుస్సైనీ ఆలం కమాన్, హష్మత్‌‌‌‌గంజ్ కమాన్‌‌‌‌ల పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. ఈ నిధులను హెచ్‌‌‌‌ఎండీఏ నుంచి విడుదల చేయనున్నారు. పనుల కోసం  డీపీఆర్ సిద్ధం చేసేందుకు కన్సల్టెన్సీ ఎంపికకు టెండర్లు పిలవడంతో పాటు, ప్రతి కమాన్‌‌‌‌కు విడివిడిగా టెండర్లు ఆహ్వానించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.