వాషింగ్టన్: హార్మూజ్ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ముదిరాయి. ఈ జలసంధిలో ప్రస్తుతం ఉన్న యథాతథ స్థితిని మార్చడానికి ఇరాన్ ఎలాంటి ప్రయత్నాలు చేసినా తాము ఒప్పుకోమని అమెరికా స్పష్టం చేసింది. ఒకవేళ ఇరాన్ అక్కడ ఏవైనా మార్పులు చేయడానికి ప్రయత్నిస్తే, అది ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని గట్టిగా హెచ్చరించింది.
ఈ విషయాలను ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'అల్ అరేబియా' గురువారం వెల్లడించింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధాన్ని ముగించడానికి కుదిరిన ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం అమలుపై ఖతార్ రాజధాని దోహాలో బుధ, గురువారాల్లో చర్చలు జరిగాయి. సానుకూల పురోగతితోనే చర్చలు ముగిశాయని ఖతార్ ప్రకటించిన వెంటనే అమెరికా నుంచి ఇరాన్‌కు వార్నింగ్ వచ్చింది.
దోహా చర్చల్లో కీలక నిర్ణయాలివే..
దోహా చర్చల్లో అమెరికా, ఇరాన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఒప్పంద ఉల్లంఘనలు జరిగితే పరిష్కరించుకునేందుకు ప్రత్యేక సమాచార మార్పిడి చానల్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని ఇరాన్ మంత్రి కాజెం ఘరీబాబాది తెలిపారు. ఇదే టైంలో హార్మూజ్ జలసంధి భద్రతకు సంబంధించి ఒమన్ దేశం ఒక కొత్త ప్రణాళికను ప్రతిపాదించింది. దీనిపై చర్చించిన ఇరు దేశాల ప్రతినిధులు.. తదుపరి సంప్రదింపుల కోసం తమ తమ రాజధానులకు తిరిగి వెళ్లారు. మరోవైపు ఈ చర్చల్లో ఇరాన్‌కు చెందిన 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 25 వేల కోట్లు) స్తంభింపజేసిన నిధులను విడుదల చేయడానికి ప్రాథమిక అంగీకారం కుదిరినట్లు ఇరాన్ వర్గాలు చెబుతున్నాయి.
కానీ, అమెరికా అధికారులు మాత్రం దీన్ని పూర్తిగా ఖండించారు. ఇరాన్ తమ నిబంధనలను పూర్తిగా పాటిస్తే తప్ప నిధులు విడుదల చేయబోమన్నారు. కాగా, దోహా చర్చల్లో ఎంఓయూకు సంబంధించిన అంశాలపై పురోగతి సాధించినట్లు పాక్ విదేశాంగ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాలు చర్చల కొనసాగింపునకు అంగీకరించాయని వెల్లడించింది.
