- 3 వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడలో దళిత యువకుడు కార్లే రాజేశ్మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. పోలీసుల చిత్రహింసల వల్లే రాజేశ్ప్రాణాలు కోల్పోయాడన్న ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న కమిషన్.. తెలంగాణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై మూడు వారాల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని సూర్యాపేట ఎస్పీ, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
న్యాయవాది రామారావు ఇమ్మానేని దాఖలు చేసిన ఫిర్యాదుతో ఈ కేసులో ఎన్‌హెచ్‌ఆర్‌సీ రంగంలోకి దిగింది. కోదాడ పోలీసులపై బాధిత కుటుంబ సభ్యులు, హక్కుల సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల కేసు విషయంలో రాజేశ్‌ను ఐదు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపిస్తున్నారు. ఒక మాజీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తప్పుడు ఒప్పుకోలు ఇప్పించేందుకే పోలీసులు రాజేశ్‌ను తీవ్రంగా కొట్టారని, ఆ చిత్రహింసలు భరించలేకే యువకుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తల్లి ఫిర్యాదు చేసినా స్పందించరా?
రాజేశ్మృతిపై అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదన్న అంశంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజేశ్పోస్ట్మార్టం పూర్తి వీడియో రికార్డింగ్‌ను సమర్పించాలని, ఘటనపై జరిగిన మెజిస్ట్రియల్ విచారణ నివేదికను అందజేయాలని స్పష్టం చేసింది.
అలాగే ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏమైనా చర్యలు తీసుకుందా లేదా అన్న వివరాలు కూడా వెల్లడించాలని ఆదేశించింది. మూడు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించకపోతే తదుపరి చర్యలు కఠినంగా ఉంటాయని కమిషన్ హెచ్చరించింది.
