- తెలంగాణలో భారీ ఏఐ క్యాంపస్ ఏర్పాటు చేయండి
- భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచన
- వీటిపై సానుకూలంగా స్పందించిన మిట్టల్
- ఏటీసీల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లూ అందిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: చందన్‌వెల్లి డేటా సెంటర్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలని భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో మరింత పెద్ద సమగ్ర డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మౌలిక సదుపాయాల క్యాంపస్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో సీఎంతో సునీల్ భారతి మిట్టల్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సీఎం సూచనపై సానుకూలంగా స్పందించిన సునీల్ మిట్టల్.. రాష్ట్రంలో డేటా సెంటర్ల కెపాసిటీని మరింత పెంచుతామని, ఫైబర్ కనెక్టివిటీని సైతం విస్తృతంగా పెంచుతామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ఉన్న అనుకూలతల దృష్ట్యా హైదరాబాద్‌ను ఎయిర్‌టెల్ సంస్థకు రెండో హెడ్‌క్వార్టర్‌లా భావిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా ఎయిర్‌టెల్ డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పెట్టుబడుల పరంగా ఎదురయ్యే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేసేలా ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను నామినేట్ చేసి సమన్వయం చేసుకోవాలని సీఎం చెప్పారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో తీసుకువస్తున్న విప్లవాత్మక సంస్కరణల పట్ల సునీల్ మిట్టల్ హర్షం వ్యక్తం చేశారు. తమ భారతీ ఫౌండేషన్‌తో ప్రభుత్వ బడులు, ఏటీసీల్లో చదువుకునే నిరుపేద విద్యార్థులకు పెద్ద ఎత్తున స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని ప్రకటించారు.
