మా దగ్గర ఐదు వరల్డ్‌కప్‌లు ఉన్నాయి.. జపాన్‌ను ఆటపట్టించిన బ్రెజిల్ ఫుట్బాల్ ప్లేయర్!

మా దగ్గర ఐదు వరల్డ్‌కప్‌లు ఉన్నాయి.. జపాన్‌ను ఆటపట్టించిన బ్రెజిల్ ఫుట్బాల్ ప్లేయర్!

Brazil vs Japan: ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా హూస్టన్ స్టేడియం వేదికగా బ్రెజిల్ వర్సెస్ జపాన్ జట్ల మధ్య జరిగిన రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ మ్యాచ్ ఒక హై-వోల్టేజ్ క్లాసిక్‌గా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో బ్రెజిల్ 2–1 తేడాతో విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లగా, జపాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కానీ, జూన్ 29న ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. బ్రెజిల్ స్టార్ ఫార్వర్డ్ మాథ్యూస్ కున్హా (Matheus Cunha) తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  

బ్రెజిల్ ఫుట్‌బాల్ పవర్‌హౌస్ కాదు: 
ఈ మ్యాచ్‌కంటే ముందే జపాన్ రైజింగ్ స్టార్ కెంటో షియోగై మీడియా ముందు మాట్లాడుతూ.. బ్రెజిల్ జట్టు ఇక ఎంతమాత్రం ఫుట్‌బాల్ ప్రపంచాన్ని శాసించే పవర్‌హౌస్ కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్స్ బ్రెజిల్ డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. 

ఐదు వేళ్లు చూపిస్తూ కున్హా కౌంటర్ ఎటాక్!
మార్టినెల్లి గోల్ కొట్టి బ్రెజిల్ విజయం ఖాయం చేయగానే, మాథ్యూస్ కున్హా నేరుగా జపాన్ ప్లేయర్ కెంటో షియోగై వైపు చూస్తూ, మ్యాచ్‌కు ముందు అతను చేసిన వ్యాఖ్యలకు ప్రతికారంగా.. తన జెర్సీపై ఉన్న బ్రెజిల్ ఫుట్‌బాల్ లోగోను చూపిస్తూ, బ్రెజిల్ గెలిచిన ఐదు ప్రపంచకప్ టైటిళ్లకు ప్రతీకగా తన ఐదు వేళ్లను (Open Hand) చూపించాడు. 

నెట్టింట సెటైరికల్ పోస్టులు: 
మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా కున్హా తన ప్రవర్తనను సమర్థించుకున్నాడు. ఒక జపాన్ ప్లేయర్ వచ్చి ఎంతో ఘనచరిత్ర ఉన్న బ్రెజిల్ జట్టును తక్కువ చేసి మాట్లాడితే మేము అస్సలు సహించం.. ఈ జెర్సీ విలువ ఏంటో, దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటో మాకు తెలుసని ప్రెస్ మీట్‌లో వెల్లడించాడు. అంతేకాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో కెండ్రిక్ లామర్ పాడిన Humble సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టి, జపాన్ టీమ్‌ను ఉద్దేశించి కొన్ని సెటైరికల్ పోస్టులు కూడా పెట్టాడు.

►ALSO READ | రేపే ఇంగ్లాండ్‌తో భారత్ ఢీ.. ఈ మ్యాచ్ ఎక్కడ చూడాలి, టైమింగ్స్ వివరాలు ఇవే!

ఓదార్చిన నెయ్మార్, అలిసన్!
మైదానంలో అంతలా రెచ్చిపోయిన కున్హా.. మ్యాచ్ ముగిసిన వెంటనే పూర్తిగా మారిపోయి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఒకవైపు బ్రెజిల్ ప్లేయర్స్ సంబరాల్లో మునిగిపోగా.. కున్హా మాత్రం ఓటమి బాధతో మైదానంలోనే ఏడుస్తూ కూలబడిన జపాన్ మిడ్‌ఫీల్డర్ ఏవో తనకా దగ్గరికి వెళ్లాడు. అతని పక్కన మోకాళ్లపై కూర్చుని, కెమెరాలు అతని ఏడుపును రికార్డ్ చేయకుండా అడ్డుగా నిలబడి అతన్ని ఓదార్చాడు. కున్హాతో పాటు బ్రెజిల్ సీనియర్ లీడర్స్ నెయ్మార్, గోల్‌కీపర్ అలిసన్ బెకర్ కూడా తమ విక్టరీ సెలబ్రేషన్స్‌ను పక్కన పెట్టి, కన్నీళ్లు పెట్టుకుంటున్న జపాన్ ఆటగాళ్లను కౌగిలించుకుని ఓదార్చారు.