ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను రైతులు తిప్పికొట్టాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను రైతులు తిప్పికొట్టాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  •  రైతు భరోసా సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • గత పాలకులకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శ
  • రైతు సంక్షేమానికి రెట్టింపు ఖర్చు చేస్తున్నామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు:  రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పదేండ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి అప్పుల ఊబిలోకి నెట్టిన మాజీ పాలకులకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. హైదరాబాద్‌‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల కోసం చేసిన ఖర్చుతో పోలిస్తే కాంగ్రెస్ సర్కారు రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని గణాంకాలతో వివరించారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ రోజుకో అబద్ధాన్ని సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, వారి తప్పుడు ప్రచారాలను రైతులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 

నిరంతరం కొనసాగనున్న రైతు భరోసా

గత ప్రభుత్వం పదేండ్ల కాలంలో రైతుల కోసం రూ.2,88,670 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, అంటే నెలకు సగటున రూ.2,532 కోట్లు, ఏడాదికి రూ.30,364 కోట్లు మాత్రమే  వెచ్చించిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే రైతు సంక్షేమానికి రూ.1,56,496 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. నెలకు సగటున రూ.5,217 కోట్లు, ఏడాదికి రూ.62,604 కోట్లు రైతుల కోసం వెచ్చిస్తున్నామని, ఇది గత ప్రభుత్వ వ్యయంతో పోలిస్తే దాదాపు రెట్టింపు అని పేర్కొన్నారు.

గత పాలకులు రాష్ట్రంపై మోపిన రూ.8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని తమ ప్రభుత్వం భరిస్తోందని భట్టి వెల్లడించారు. ఆ అప్పులకు సంబంధించి రెండున్నర సంవత్సరాల్లోనే రూ.2,08,557 కోట్లను వడ్డీలు, అసలు చెల్లింపులకే వెచ్చించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అయినప్పటికీ, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి వెనుకడుగు వేయలేదని స్పష్టం చేశారు. రైతులకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని.. రైతు రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్ అమలు చేసినట్టుగానే రైతు భరోసా పథకాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం నిరంతరాయంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

 రైతు సంక్షేమానికే ప్రభుత్వ ప్రాధాన్యం: తుమ్మల

 గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో విధ్వంసం చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షలలోపు రైతు రుణాలను మాఫీ చేసి, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రైతుల ఖాతాల్లో రూ.22 వేల కోట్లకుపైగా జమ చేసినట్టు తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించినా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, రైతు సమస్యలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ‘‘కేసీఆర్ ఒక్క రైతుబంధు ఇచ్చి.. అన్నీ బంద్ చేశారు’’ అని వ్యాఖ్యానించారు. కేంద్రం నిధులు అందించే పలు వ్యవసాయ పథకాలను కూడా అప్పటి ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రస్తుతం ధాన్యం ఉత్పత్తి, సేకరణలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు