గూగుల్ కంపెనీలో ఉద్యోగం అంటేనే నెల తిరిగేసరికి వచ్చే జీతం, కార్పొరేట్ ఆఫీసుల్లో లగ్జరీ లైఫ్. అలాంటి ప్రపంచంలోనే అత్యున్నత టెక్నాలజీ సంస్థలో ఏకంగా రూ.9కోట్ల భారీ ప్యాకేజీ ఉంటే ఆ ఉద్యోగాన్ని ఎవరైనా వదులుకుంటారా? 41 ఏళ్ల యూసుఫ్ ఇమ్రాన్ మాత్రం ఆ కళ్ళు చెదిరే శాలరీని కాదనుకుని.. తన సొంత కలను నిజం చేసుకోవడానికి గూగుల్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేశారు. ఏఐ ప్రపంచాన్ని శాసించబోతున్న తరుణంలో.. కార్పొరేట్ జాబ్ చక్రంలో ఉండిపోతే వెనకబడిపోతానేమో అన్న ఫోమో.. సంస్థల్లో జరుగుతున్న లే-ఆఫ్స్ ఆయన్ని ఈ సంచలన నిర్ణయం వైపు నడిపించాయి.
గూగుల్‌లో యూసుఫ్ ఇమ్రాన్ బేసిక్ శాలరీ రూ. కోటి 61లక్షలు కాగా.. ఆయన అద్భుతమైన సేల్స్ ప్రతిభతో సాధించిన కమిషన్లు అన్నీ కలిపి గతేడాది ఆయన మొత్తం సంపాదన ఏకంగా రూ.9కోట్ల 36లక్షలకు చేరింది. ఇంత పెద్ద మొత్తాన్ని వదులుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ వంటి సంస్థలు ఇస్తున్న భారీ స్టాక్ ఆప్షన్లతో పోలిస్తే గూగుల్ ఇచ్చే గ్రోత్ తక్కువేనని ఆయన గ్రహించారు. అంతేకాకుండా.. గూగుల్‌లో జరిగిన వరుస లే-ఆఫ్స్‌లో ఎంతో టాలెంట్ ఉన్న తన సహోద్యోగులు ఉద్యోగాలు కోల్పోవడం చూశాక, ఎంత పెద్ద కంపెనీలోనైనా ఉద్యోగ భద్రత అనేది ఎండమావేనని యూసుఫ్‌కు అర్థమైంది. అందుకే ఇతరుల కంపెనీల కోసం కాకుండా తన సొంత సామర్థ్యంపై నమ్మకంతో రిస్క్ తీసుకోవడమే బెస్ట్ అని భావించారు.
ఈ నిర్ణయం ఆయన ఆవేశంతో తీసుకున్నది కాదు. చాలా పక్కా ప్లానింగ్‌తో అడుగులు వేశారు. గూగుల్‌లో పనిచేస్తున్నప్పుడే రాత్రిళ్లు, వారాంతాల్లో ఏఐ మోడల్స్‌పై ప్రయోగాలు చేస్తూ 'మాంగోస్టీన్ స్టూడియో' అనే స్టార్టప్‌కు రూపకల్పన చేశారు. ఇది సేల్స్ టీమ్స్ తమ డీల్స్‌ను వేగంగా ముగించడానికి సహాయపడే ప్రత్యేకమైన ఏఐ టూల్స్ తయారు చేస్తుంది. బయటి ఇన్వెస్టర్ల చుట్టూ తిరగకుండా, కంపెనీపై పూర్తి యాజమాన్య హక్కులు తన వద్దే ఉంచుకోవడానికి యూసుఫ్ ముందే ఆర్థికంగా సిద్ధమయ్యారు. వ్యాపార ఖర్చుల కోసం రూ.2 కోట్లు, రాబోయే రెండేళ్ల పాటు తన హోమ్ లోన్ ఇన్‌స్టాల్మెంట్లు, వ్యక్తిగత ఖర్చుల కోసం మరో రూ. కోటి 42లక్షలు సొంతంగా పొదుపు చేసుకుని ఆ తర్వాతే గూగుల్‌లో ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ALSO READ : జులైలో బ్యాంకు పనులు ముందే పూర్తి చేసుకోండి..
ఏఐ రంగంలో రాణించడానికి కంప్యూటర్ సైన్స్ డిగ్రీల కంటే, మార్కెట్‌లో ఉన్న నిజమైన సమస్యలను గుర్తించడమే ముఖ్యమని యూసుఫ్ నమ్ముతున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాకపోయినప్పటికీ.. సేల్స్ రంగంలో తనకున్న 20 ఏళ్ల అనుభవమే అతనికి అండగా నిలిచింది. ఫైనాన్షియల్లీ సేఫ్ కార్పొరేట్ జీవితాన్ని వదిలి, ఏఐ సృష్టిస్తున్న అనంతమైన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి నేటి తరం నిపుణులు ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతున్నారనేందుకు యూసుఫ్ ఇమ్రాన్ ప్రయాణమే నిదర్శనం.
