కొట్టేసిన రాములోరి డబ్బు, నగలను బాత్ రూంలో దాచారు: విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు

కొట్టేసిన రాములోరి డబ్బు, నగలను బాత్ రూంలో దాచారు: విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు

లక్నో: అయోధ్య రామ మందిర విరాళాల గోల్ మాల్, నిధుల దుర్వినియోగం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కొట్టేసిన రాములోరి డబ్బు, నగలను బాత్ రూంలో దాచారు నిందితులు. పోలీసుల విచారణలో స్వయంగా నిందితులే ఈ విషయాన్ని బయటపెట్టారు. 

అయోధ్య రామ మందిర విరాళాల గోల్ మాల్ కేసులో పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లాను పోలీసులు  మంగళవారం అదుపులోకి తీసుకుని విచారించారు. 2 గంటల విచారణలో అవినాష్ శుక్లా దిమ్మతిరిగిపోయే విషయాలు బయటపెట్టాడు. రామయ్య విరాళాల్లో కోట్ల రూపాయలు మాయం చేసినట్లు అంగీకరించాడు నిందితుడు.

‘‘విరాళాల లెక్కింపు గది తాళాలలో ఒకటి టిన్ను యాదవ్ దగ్గర మరోకటి బ్యాంకు ఉద్యోగుల దగ్గర ఉంది. పలువురు వ్యక్తుల సమన్వయంతో ఈ దొంగతనం జరిగింది. హుండీల నుంచి ఒకరు వ్యక్తి డబ్బు తీస్తుండగా మిగతావారు అతడిని కవర్ చేసేవారు. ఆలయ కాంప్లెక్స్ లోపల అమర్చిన కెమెరాల ఎక్కడెక్కడ ఉన్నాయో నిందితులందరికీ తెలుసు. 

ఈ సమాచారం ద్వారా సీసీ కెమెరాల కంట పడకుండా దొంగలించిన డబ్బు, నగలను మొదట ఆలయ కాంప్లెక్స్ బాత్రూమ్‌లలో దాచి ఆ తర్వాత అవకాశం దొరికినప్పుడల్లా దాన్ని బయటకు తీసుకెళ్లేవాళ్లం. ట్రస్ట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు తాము దగ్గరగా ఉండటం వల్ల తమపై పెద్దగా ఎవరికీ అనుమానం రాలేదు. తమపై నిఘా కూడా ఎక్కువగా లేదు. దొంగిలించిన విరాళాల సొమ్ముతో భూమి, ఇల్లు కొనుగోలు చేశా’’ అని పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెల్లడించాడు అవినాష్ శుక్లా. 

వివాదం ఏంటంటే..?

అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం, ట్రస్ట్ నిధుల్లో గోల్ మాల్ జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. రామ మందిర ప్రాంగణంలోని విరాళాల పెట్టెల నుంచి డబ్బు మాయమైందని ప్రతిపక్ష సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. ఈ ఘటనపై విచారణ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

మరోవైపు.. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడానికి.. వాస్తవాలను నిర్ధారించుకోవడానికి విచారణకు ఆదేశించాలని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కూడా ప్రభుత్వాన్ని కోరింది. ప్రతిపక్షాల డిమాండ్, ట్రస్ట్ అభ్యర్థన మేరకు రామ మందిర విరాళాల వివాదంపై యోగి సర్కార్ సిట్ విచారణకు ఆదేశించింది.

ఈ మేరకు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వివాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, నివేదిక సమర్పించాలని ప్రభుత్వం సిట్‎ను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కేసును సీరియస్‎గా తీసుకున్న సిట్.. అయోధ్యలోని రామ మందిర ట్రస్ట్‎కు సంబంధించిన విరాళాలు, ఆర్థిక నిర్వహణపై లోతుగా విచారణ చేపట్టింది.

ఇందులో భాగంగా ఆలయ విరాళాల లెక్కింపుతో సంబంధం ఉన్న పలువురు ఉద్యోగులు, సిబ్బందిని సిట్ విచారించింది. ఆరు రోజుల పాటు పలువురిని ప్రశ్నించింది. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సీసీటీవీ పుటేజ్‎తో పాటు ఇతర సాంకేతిక, భౌతిక సాక్ష్యాలను పరిశీలించింది. ఆరు రోజుల విచారణ అనంతరం కేసుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను సీఎంకు అందజేసింది సిట్. నిధుల గోల్ మాల్ వ్యవహారంలో 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.