వారం రోజులు అలర్ట్ గా ఉండండి.. కార్యకర్తలకు మంత్రి వివేక్ కీలక ఆదేశాలు

వారం రోజులు అలర్ట్ గా ఉండండి.. కార్యకర్తలకు మంత్రి వివేక్ కీలక ఆదేశాలు

రాబోయే వారం రోజుల పాటు నేతలు, కార్యకర్తలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి వివేక్ వెంకటస్వామి  పిలుపునిచ్చారు. మన ఓట్లతో పాటు, కార్యకర్తల ఓట్లు కూడా ఎక్కడా తొలగింపునకు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో  సర్  ప్రక్రియపై పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన  ప్రస్తుతం జరుగుతున్న 'సర్' ప్రక్రియపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా బూత్ లెవెల్ అధికారులు అంటే బీఎల్ఓలు ఇచ్చే ఫాంలను, అలాగే సిబ్బంది ఇచ్చే దరఖాస్తులను అత్యంత జాగ్రత్తగా నింపాలని కార్యకర్తలకు సూచించారు. చిన్న తప్పు జరిగినా ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఓట్ల తొలగింపు ఎంతటి తీవ్ర నష్టాన్ని మిగులుస్తుందో చెప్పేందుకు పశ్చిమ బెంగాల్ ఉదాహరణను మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. బెంగాల్‌లో గతంలో ఏకంగా 90 లక్షల ఓట్లను తొలగించారని.. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఫిర్యాదు చేయడంతో తిరిగి 60 లక్షల ఓట్లను పునరుద్ధరించారని గుర్తు చేశారు. అయినప్పటికీ మిగిలిన 30 లక్షల ఓట్ల తేడాతోనే అక్కడ మమతా బెనర్జీ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని మంత్రి వివేక్ వివరించారు.

రాజకీయాల్లో ప్రతీ ఒక్క ఓటు ఎంతో విలువైనదని.. ఓటర్ల జాబితా విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మంత్రి హెచ్చరించారు. అందుకే ప్రతీ ఓటు విషయంలో నేతలు, కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్‌లో అప్రమత్తంగా ఉండి, బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి వివేక్ ఆదేశించారు.