తెలంగాణ చరిత్రలోనే ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు అని, రాష్ట్రవ్యాప్తంగా కోటి 6 లక్షల రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డైనా వచ్చిందా అని ప్రశ్నించిన ఆయన, నిరుపేదలకు స్మార్ట్ రేషన్ కార్డు ఎంతగానో అవసరమని పేర్కొన్నారు.
సంగారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. నిరుపేదలకు అత్యంత ప్రయోజనకరమైన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, రేషన్ రంగంలో ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక మార్పులను వివరించారు.
గతంలో ఇచ్చే దొడ్డు బియ్యాన్ని ఎవరూ తినక ఐదు, పది రూపాయలకే అమ్ముకునేవారని గుర్తుచేశారు. నేడు రైతుల దగ్గర సన్నవడ్లను కొనుగోలు చేసి, రాష్ట్రంలోని 3 కోట్ల 40 లక్షల మందికి రేషన్ ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు.
ప్రతి మనిషికి నెలకు 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్నబియ్యాన్ని ఇస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయిలో నాణ్యమైన బియ్యం ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. నిరుపేదలకు రేషన్ బియ్యం అందించేందుకు ప్రభుత్వం రూ. 14,890 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం కంటే భిన్నంగా ఏకంగా 150 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
