15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో.. అమెరికాలో ఎస్సార్ గ్రూప్ స్టీల్ ఫ్యాక్టరీ..

15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో.. అమెరికాలో ఎస్సార్ గ్రూప్ స్టీల్ ఫ్యాక్టరీ..
  • 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో అమెరికాలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ నిర్మాణం
  • వైట్ హౌస్‌‌‌‌లో ప్రాజెక్టును ప్రకటించిన ట్రంప్ 

వాషింగ్టన్: భారత్​కు చెందిన ప్రముఖ ఎస్సార్ గ్రూప్.. అమెరికాలో 15 బిలియన్ డాలర్ల(రూ.1.43లక్షల కోట్ల) పెట్టుబడితో అతిపెద్ద స్టీల్​ఫ్యాక్టరీని నిర్మించనుంది. దీనిని ఎస్సార్ గ్రూప్ యాజమాన్యంలోని మెసాబి మెటాలిక్స్ ఐయోవా రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వైట్ హౌస్‌‌‌‌లో మెసాబి మెటాలిక్స్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌లతో కలిసి ఈ ప్రాజెక్టును ప్రకటించారు. ఈ పెట్టుబడి అమెరికా తయారీ రంగానికి అతిపెద్ద ప్రోత్సాహమని ఆయన అభివర్ణించారు. 

ఉక్కు పరిశ్రమ మళ్లీ పుంజుకుంటుందన్నారు. అలాగే, అమెరికాలో తయారీ రంగాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా విదేశీ ఉక్కుపై టారిఫ్​లను 50 శాతానికి పెంచినట్టు ట్రంప్ తెలిపారు. ఇతర దేశాల ఉక్కుపై భారీ టారిఫ్‌‌‌‌లు ఉండటం వల్లే విదేశీ కంపెనీలు అమెరికాలోనే ప్లాంట్లు నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో ఎస్సార్ గ్రూప్ మొత్తం 18 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోందని ట్రంప్ వెల్లడించారు. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఉక్కు కర్మాగారంగా వైట్ హౌస్ అభివర్ణించింది. కాగా, అమెరికాలో తయారీ రంగాన్ని విస్తరించే ప్రయత్నానికి తమకు మద్దతు ఇచ్చినందుకు ఎస్సార్ గ్రూప్ చైర్మన్ రేవంత్ రూయా ట్రంప్​కు ధన్యవాదాలు తెలిపారు.

2030లో మొదటి దశ ఉక్కు ఉత్పత్తి..

మిన్నెసోటాలోని నాష్‌‌‌‌వాక్ వద్ద ఉన్న మైన్ నుంచి ఇనుప ఖనిజాన్ని తవ్వి, దాన్ని ఐయోవాలోని ప్లాంట్‌‌‌‌కు తరలించి ఉక్కుగా మారుస్తారు. మొదటి దశలో ఏటా 7.5 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్తులో దీనిని 10 మిలియన్ టన్నులకు పెంచనున్నారు. మొదటి దశ ఉక్కు ఉత్పత్తి 2030 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మిన్నెసోటాలోని ‘మెసాబీ ఐరన్ రేంజ్’లో 50 ఏండ్ల తర్వాత అందుబాటులోకి వచ్చిన తొలి కొత్త ఇనుప ఖనిజం గని ఇది.