- పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ వెల్లడి
- గాంధీభవన్లో ఠాగూర్ కు సన్మానం
హైదరాబాద్, వెలుగు: పార్టీ ఇన్చార్జ్గా 2020లో మాణిక్కం ఠాగూర్ తీసుకున్న కీలక నిర్ణయాల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ వచ్చిన మాణిక్కం ఠాగూర్ ను గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సన్మానించారు. అనంతరం ఠాకూర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించడంలో ఠాగూర్ కీలక పాత్ర పోషించారని, ఆ నిర్ణయంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు. కాంగ్రెస్ ను బలోపేతం చేయడంలో పార్టీ ఇన్చార్జ్గా మాణిక్కం ఠాగూర్ ఎంతో కష్టపడ్డారన్నారు. రాహుల్ భారత్ జోడో యాత్రతో రాష్ట్రంలో పార్టీకి ఊపు వచ్చిందన్నారు.
తెలుగు ప్రజలతో నాది ప్రత్యేక అనుబంధం
తెలుగు ప్రజలతో తనది ప్రత్యేక అనుబంధమని మాణిక్కం ఠాగూర్ అన్నారు. చాలా కాలం తర్వాత గాంధీ భవన్ కు రావడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను పార్టీ క్యాడర్ విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
