హైదరాబాద్, వెలుగు: సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి సభతో కేటీఆర్‌కు ఇక అసలు సినిమా చూపిస్తామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గానికి కేటీఆర్ చేసిందేమీ లేదని చెప్పారు. ఆయన చేసిన తప్పులను సీఎం సభలోనే ప్రజలకు వివరిస్తామన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో చామల మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డికి అన్యాయం చేసి కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచారని ఆరోపించారు.
కొడుకు పట్టాభిషేకం కోసమే కేసీఆర్ కేటీఆర్‌ను సిరిసిల్లకు పంపారని విమర్శించారు. సిరిసిల్ల చెరువులో కలెక్టరేట్ కట్టించిన కేటీఆర్.. వరదలు వచ్చినప్పుడు అక్కడి నుంచి కలెక్టర్ ట్రాక్టర్‌లో బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చిందని చామల విమర్శించారు. సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి రూ.375 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు.
