జగ్గారెడ్డి తెలంగాణలోనే నంబర్ వన్ లీడర్.. వెయ్యికోట్లిచ్చినా ఇలాంటి లీడర్ దొరకడు :సీఎం రేవంత్

జగ్గారెడ్డి తెలంగాణలోనే నంబర్ వన్ లీడర్.. వెయ్యికోట్లిచ్చినా ఇలాంటి లీడర్ దొరకడు :సీఎం రేవంత్

సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ బహిరంగ సభలో  సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగ్గారెడ్డేనని సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జగ్గారెడ్డితో తనకున్న ముప్పై ఏళ్ల అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ప్రజల కోసం పరితపించే నాయకుల్లో జగ్గారెడ్డి నంబర్ వన్ అని కొనియాడారు. ఆయన గెలిచి ఉంటే మంచి పదవిలో ఉండేవారని, ఒకవేళ ఓడిపోయినా ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి అని ప్రశంసించారు. వెయ్యి కోట్లు, వజ్రాలు ఇచ్చినా జగ్గారెడ్డి లాంటి నాయకుడు దొరకడని అభివర్ణించారు.

రాహుల్ గాంధీ రాముడైతే... జగ్గారెడ్డి హనుమంతుడని, రాహుల్ గాంధీ గీసిన గీతను జగ్గారెడ్డి ఎప్పుడూ దాటడని స్పష్టం చేశారు. జగ్గారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది రాహుల్ గాంధీనే నిర్ణయిస్తారని తెలిపారు.జగ్గారెడ్డి నేను ఎన్నికల్లో నిలబడను అంటే కాదు... ఇంకోసారి జగ్గారెడ్డి అలా అంటే వారం రోజులు ఇంట్లో పెట్టి తాళం వేయండి అంటూ నవ్వులు పూయించారు.


జగ్గారెడ్డిని కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని, ఆయన ఎల్లప్పుడూ ప్రజా జీవితంలో ఉండాలని సీఎం కోరారు. ఒక సోదరుడిగా తాను ఎప్పుడూ జగ్గారెడ్డికి అండగా ఉంటానని  సీఎం రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు.