అయోధ్య రామ మందిర ట్రస్ట్ అధిపతి మహంత్ నృత్య గోపాల్ దాస్‎కు అస్వస్థత

అయోధ్య రామ మందిర ట్రస్ట్ అధిపతి మహంత్ నృత్య గోపాల్ దాస్‎కు అస్వస్థత

లక్నో: అయోధ్య రామ మందిరం విరాళాల అక్రమాలు, నిధులు  దుర్వినియోగం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ తరుణంలో శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షులు మహంత్ నృత్య గోపాల్ దాస్ (86) అస్వస్థతకు గురయ్యారు. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను లక్నోలోని మెదాంత ఆసుపత్రిలో చేర్పించారు. 

ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. గతంలో కూడా ఆయన  కిడ్నీ, మూత్రపిండం, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ కారణంగా అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. అయోధ్య రామ మందిరం విరాళాల గోల్ మాల్, నిధుల దుర్వినియోగం కేసు విచారణ కీలక దశలో ఉన్న వేళ ట్రస్ అధ్యక్షుడు అనారోగ్యానికి గురికావడం గమనార్హం. 

అయోధ్య వివాదం ఏంటంటే..?

అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం, ట్రస్ట్ నిధుల్లో గోల్ మాల్ జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. రామ మందిర ప్రాంగణంలోని విరాళాల పెట్టెల నుంచి డబ్బు మాయమైందని ప్రతిపక్ష సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. ఈ ఘటనపై విచారణ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

మరోవైపు.. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడానికి.. వాస్తవాలను నిర్ధారించుకోవడానికి విచారణకు ఆదేశించాలని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కూడా ప్రభుత్వాన్ని కోరింది. ప్రతిపక్షాల డిమాండ్, ట్రస్ట్ అభ్యర్థన మేరకు రామ మందిర విరాళాల వివాదంపై యోగి సర్కార్ సిట్ విచారణకు ఆదేశించింది.

ఈ మేరకు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వివాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, నివేదిక సమర్పించాలని ప్రభుత్వం సిట్‎ను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కేసును సీరియస్‎గా తీసుకున్న సిట్.. అయోధ్యలోని రామ మందిర ట్రస్ట్‎కు సంబంధించిన విరాళాలు, ఆర్థిక నిర్వహణపై లోతుగా విచారణ చేపట్టింది.

ఇందులో భాగంగా ఆలయ విరాళాల లెక్కింపుతో సంబంధం ఉన్న పలువురు ఉద్యోగులు, సిబ్బందిని సిట్ విచారించింది. ఆరు రోజుల పాటు పలువురిని ప్రశ్నించింది. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సీసీటీవీ పుటేజ్‎తో పాటు ఇతర సాంకేతిక, భౌతిక సాక్ష్యాలను పరిశీలించింది. ఆరు రోజుల విచారణ అనంతరం కేసుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను సీఎంకు అందజేసింది సిట్. నిధుల గోల్ మాల్ వ్యవహారంలో 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.