రైతులకు బ్యాడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా ఈ నెల (జులై)లో కూడా తక్కువ వర్షాలే..!

రైతులకు బ్యాడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా ఈ నెల (జులై)లో కూడా తక్కువ వర్షాలే..!

న్యూఢిల్లీ: దేశంలోని రైతులకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఎల్ నినో పరిస్థితుల  కారణంగా జూలై నెలలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. జూలై నెల వర్షపాతం దీర్ఘకాల సగటు కంటే 94 శాతం తక్కువగా ఉంటుందని పేర్కొంది. తక్కువ వర్షపాతం వ్యవసాయం, నీటి వనరులకు సవాళ్లను సృష్టించవచ్చని హెచ్చరించింది. 

ఈ లోటు వర్షపాత పరిస్థితిని ఎదుర్కొవడానికి నీటి సంరక్షణ, అందుబాటులో ఉన్న నీటి వనరుల సమర్థవంతమైన నిర్వహణ వంటి చర్యలు చేపట్టాలని సూచించింది. కాగా, జూన్ నెలలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే. దీంతో రైతులంతా జులై, ఆగస్టు నెలలపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ జులైలో కూడా వర్షాలు తక్కువగానే కురిసే అవకాశం ఉందన్న ఐఏండీ అంచనాలతో రైతులు ఆందోనకు గురవుతున్నారు. 

తెలంగాణలోనూ ఇదే సీన్..!

తెలంగాణలో అన్నదాతల పరిస్థితి మళ్లీ అయోమయంలో పడింది. వానకాలం సీజన్ ప్రారంభమై నెల గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో.. ఇప్పుడు రైతులంతా జులై, ఆగస్టు నెలలపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే వాతావరణ శాఖ అందుతున్న సమాచారం ప్రకారం.. జులై నెలలోనూ పెద్దగా వర్షాలు ఉండే అవకాశం లేదని అధికారులు చెప్తుండటం రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతానికి ఉపశమనంగా..  ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో మాత్రం అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

ఈ ఏడాది వర్షపాతం గణాంకాలను పరిశీలిస్తే.. ఈ సారి కేవలం సాధారణ వర్షాలు మాత్రమే నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గడిచిన జూన్ నెలలో ఏకంగా 17 శాతం జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. దీనికి ప్రధాన కారణం ఎల్ నినో ఎఫెక్ట్, అలాగే నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రాష్ట్రాన్ని తాకడమేనని నిపుణులు చెప్తున్నారు.

జూన్ నెలలో రాష్ట్ర సగటు వర్షపాతం 130 మిల్లీమీటర్లుగా నమోదైంది. కేవలం 12 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా.. మిగిలిన జిల్లాల్లో వర్షాలు లేక భూములు ఎండిపోతున్నాయి. ముందస్తుగా విత్తనాలు వేసిన రైతులు వానల కోసం ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. మరి జులై, ఆగస్టు నెలల్లోనైనా వరుణుడు కరుణించి పంటలను కాపాడుతాడో లేదో చూడాలి.