సోనియా గాంధీ లేకుంటే వందేళ్లయినా తెలంగాణ వచ్చేది కాదు.. నితిన్ నబీన్‌కు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్

సోనియా గాంధీ లేకుంటే వందేళ్లయినా తెలంగాణ వచ్చేది కాదు.. నితిన్ నబీన్‌కు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్

తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి స్థానమే లేదని స్పష్టం చేశారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తప్ప మరే ఇతర పార్టీకి అవకాశం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని మోదీ, అమిత్ షాల రౌడీయిజంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల దొంగతనానికి పాల్పడ్డారని.. అక్కడ 92 లక్షల ఓట్లు తీసేయడం వల్లే మమతా బెనర్జీ 32 లక్షల ఓట్లతో ఓడిపోయారని మహేశ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ కేవలం ఓట్లే కాదు.. సీట్లను కూడా చోరీ చేస్తోందని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని పాలిస్తున్నారని.. ఈడీ దాడుల్లో 96 శాతం ప్రతిపక్ష పార్టీ నేతలపైనే జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. మోదీ, అమిత్ షా ద్వయం ఎన్నికల కమిషన్ చేతులు కట్టేసి, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు.

ఇక తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నితిన్ నబీన్‌కు అసలు తెలంగాణపై అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంపై కనీస అవగాహన ఉండే మాట్లాడుతున్నారా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ వచ్చిందన్న నిజాన్ని నితిన్ నబీన్ తెలుసుకోవాలని హితవు పలికారు.

బీజేపీ పన్నెండేండ్ల అరాచకాలపై దేశ ప్రజలు విసిగిపోయారని.. ఇప్పుడు దేశమంతా ‘బీజేపీ ముక్త భారత్’ను కోరుకుంటోందని మహేశ్ కుమార్ స్పష్టం చేశారు. 70 ఏండ్ల తెలంగాణ కలను సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని.. సోనియా గాంధీ గారు లేకుంటే వందేండ్లైనా తెలంగాణ వచ్చేది కాదని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సన్న బియ్యం’ పంపిణీ ఓ విప్లవాత్మక కార్యక్రమమని.. అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తున్నామని ఈ సందర్భంగా టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు.