- మొదటి విడత జిల్లాకో 70 రెవెన్యూ గ్రామాల ఎంపిక
- నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు
- ఇప్పటికే జిల్లాలకు చేరిన రోవర్లు, సర్వేయర్లకు అందజేత
- సర్వే అనంతరం రైతులకు కోఆర్డినేట్స్ తో భూధార్ నంబర్లు
- వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్స్
కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో 90 ఏండ్ల తర్వాత మళ్లీ భూముల సర్వే మొదలైంది. ఏండ్లుగా పేరుకుపోయిన గెట్టు తగాదాలకు, భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. వ్యవసాయ భూములను రీసర్వే చేసి భూభారతి చట్టంలో పేర్కొన్నట్లుగా భూధార్ కార్డులను ప్రతి రైతుకు అందించబోతున్నది. మొదటి దశలో ప్రతి జిల్లాకో 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేయబోతున్నారు. ఎంజాయ్ మెంట్ సర్వే ద్వారా ల్యాండ్ మ్యాప్ పార్సిల్స్ రూపొందించనున్నారు. ఎంపిక చేసిన రెవెన్యూ గ్రామాల్లో రీసర్వేకు ముందు మొదట రైతులతో గ్రామసభలు నిర్వహించనున్నారు.
సర్వేయర్లకు రోవర్స్
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్ మెంట్ లో సర్వేయర్ల కొరత ఉండడంతో ఆ కొరత తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 6 వేల మంది సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరంతా మండల సర్వేయర్లకు అసిస్టెంట్లుగా ఉంటున్నారు. రీసర్వేలో వారి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోబోతున్నారు. ఇన్నాళ్లు చైన్ పద్ధతిలో కొలతలు వేసేవారు. ఈ పద్ధతిలో సర్వేచేయాలంటే మ్యాన్ పవర్ ఎక్కువగా అవసరం ఉండడంతోపాటు సమయం ఎక్కువ పట్టేది. కానీ ఇప్పుడు సర్వే కోసం అధునాతన రోవర్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పటికే ఆ రోవర్లు సర్వే చేపట్టబోయే మండలాలకు అందాయి.
రీ సర్వే చేసేది ఇలా..
ముందుగా ఎంపిక చేసిన గ్రామ సరిహద్దులను గుర్తించనున్నారు. ఇలా ఒక ఊరికి మరో ఊరికి మధ్య ఉన్న బౌండరీలను ఫిక్స్ చేస్తారు. ఇరు గ్రామాల పెద్దలు, పొలిమేరల్లో ఉన్న రైతుల సమక్షంలో హద్దులను నిర్ధారణ చేస్తూ తీర్మానం చేస్తారు. అలాగే ఏమైనా వివాదం ఉంటే నమోదు చేస్తారు. ఆ తర్వాత గ్రామ పరిధిలోని వ్యవసాయ భూముల సర్వే నంబర్లు, బైనంబర్ల వారీగా వ్యవసాయ భూములను ఎంజాయ్ మెంట్ సర్వే నిర్వహిస్తారు. దీని ద్వారా రికార్డుల్లో భూవిస్తీర్ణం ఎంత ఉన్నప్పటికీ..
రైతు ఆధీనంలో ఎంత భూమి ఉందనే విషయంలో నిర్ధారణకు రానున్నారు. గతంలో మొత్తం సర్వే నంబర్ కు తప్ప ఆ తర్వాత క్రియేట్ చేసిన భై నంబర్లకు ఎలాంటి నక్షలు (మ్యాప్ లు) లేవు. తాజా రీ సర్వేతో బై నంబర్లకు మ్యాప్ లను సిద్ధం చేయనున్నారు. అక్షాంశాలు, రేఖాంశాల వారీగా కోఆర్డినేట్స్ ఇస్తూ బౌండరీలను ఫిక్స్ చేసి ఆన్ లైన్ చేస్తారు. దీంతో భవిష్యత్ లో గెట్టు రాళ్లు ఎటు కదిలినా రైతులు ఇంచు భూమి కూడా కోల్పోయే అవకాశం ఉండదు.
15 ఏండ్లకోసారి రీ సర్వే
హైదరాబాద్ సర్వే అండ్ సెటిల్మెంట్ మాన్యువల్ ప్రకారం ప్రతి 15 ఏండ్లకోసారి భూముల రీసర్వే నిర్వహించాల్సి ఉంది. రీ సర్వే ద్వారా గెట్లను పునరుద్ధరించడం, భూ వినియోగం లేదా భౌగోళిక స్వరూపంలో వచ్చిన మార్పులను కొలవడం వంటి పనులు చేపట్టాల్సి ఉంది. కానీ నిజాం హయాంలో 1936లో చివరిసారిగా సమగ్ర భూసర్వే నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ సమగ్ర భూసర్వే చేపట్టలేదు. హైదరాబాద్ సర్వే అండ్ సెటిల్మెంట్ మాన్యువల్ ప్రకారం సర్వే చేశాక 30 ఏళ్ల వరకే హద్దులకు గ్యారంటీ ఉంటుంది. 30 ఏళ్లలో భూమి పంపకాలు, అమ్మకాలు జరగడంతో సగానికిపైగా భూముల్లో మార్పులు జరుగుతాయి. అందుకే రీసర్వే చేయాలనే నిబంధన ఉంది. గత సర్కార్ హయాంలో సమగ్ర భూసర్వే చేస్తామని అప్పటి సీఎం కేసీఆర్ ఐదారుసార్లు ప్రకటించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్స్
2017లో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనలో పాత రికార్డుల్లో ఎంత భూమి ఉంటే.. దానినే ప్రామాణికంగా తీసుకుని, ఫీల్డ్ లో ఎంత భూమి ఉందనే విషయాన్ని పట్టించుకోకపోవడంతో విస్తీర్ణం విషయంలో అనేక తప్పులు దొర్లాయి. దీంతో ఈ రీసర్వేతో భూవిస్తీర్ణంలో హెచ్చుతగ్గులు అనేకం వెలుగుచూసే అవకాశముంది. అలాగే ఒక రైతు ఒక సర్వే నంబర్ లో భూమి సాగు చేసుకుంటే.. రికార్డుల్లో మాత్రం మరో సర్వే నంబర్ భూమి అతడి పేరుపై నమోదై ఉన్న ఘటనలు ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో ఉన్నాయి.
రీసర్వేతో ఇలాంటివి కూడా బయటపడే అవకాశముంది. అందుకే ఇలాంటి భూవివాదాల పరిష్కారానికి భూభారతి చట్టంలో పేర్కొన్నట్లుగా ప్రభుత్వం త్వరలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయనుంది. రీసర్వే చేస్తున్న క్రమంలో వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) స్థాయిలో రెవెన్యూ ట్రిబ్యునల్స్ పనిచేయనున్నట్లు తెలిసింది.
