- కాంగ్రెస్ సర్కారుకు కౌంట్‌డౌన్ మొదలైంది: నితిన్ నబీన్
- 2028లో ఇక్కడ కాషాయ జెండా ఎగరడం ఖాయం
- రాష్ట్రంలో అంతా వసూళ్ల రాజకీయం.. ఆరు గ్యారంటీలు గాల్లోనే..
- మూసీ ప్రాజెక్టు పేరిట భారీ దోపిడీకి ప్లాన్.. బీజేపీ రాగానే మతపరమైన రిజర్వేషన్లు రద్దు
- బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్.. ముగ్గురూ ఒక్కటే.. ఘట్‌కేసర్‌లో పార్టీ స్టేట్ కమిటీ మీటింగ్
హైదరాబాద్, వెలుగు: ‘‘తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని జాతీయ నాయకత్వం ప్రత్యేక మిషన్‌గా స్వీకరించింది. దీన్ని సక్సెస్ చేసే బాధ్యత ప్రతి కార్యకర్తదే" అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. 2028లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారుకు కౌంట్‌డౌన్ మొదలైందని ఆయన తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 35 శాతం ఓట్లతో బీజేపీ తన సత్తా చాటిందని, ఇప్పుడు ప్రతి కార్యకర్త వికసిత్ తెలంగాణ కోసం యుద్ధానికి రెడీ కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఘట్‌కేసర్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ మీటింగ్‌కు నితిన్ నబీన్ చీఫ్ గెస్ట్‌గా హాజరై నేతలకు దిశానిర్దేశం చేశారు. రేవంత్ సర్కార్ తెలంగాణను ఢిల్లీ కాంగ్రెస్‌కు ఏటీఎంలా మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. గ్యారంటీల పోస్టర్లు గోడలపై ఉన్నాయి కానీ.. స్కీమ్స్ పేదల ఇళ్లకు చేరలేదన్నారు. నిరుద్యోగ భృతి ఏదని, మహిళలకు ఇస్తామన్న ఆర్థిక సాయం ఎక్కడ అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని మూటగట్టి ఢిల్లీకి తరలిస్తున్నారని, మూసీ ప్రాజెక్టు పేరుతో మరో భారీ అవినీతికి తెరలేపారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు మూడూ ఒకే తాను ముక్కలని.. అవినీతి, కుటుంబ పాలనే వాటి డీఎన్ఏ అని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో బీజేపీ పవర్‌లోకి వచ్చిన వెంటనే మతపరమైన రిజర్వేన్లను రద్దు చేస్తామని, ఆ ఫలాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అందజేస్తామని నితిన్ నబిన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని, కానీ బీజేపీ ప్రతి పౌరుడిని సంతృప్తి పరిచే డెవలప్‌మెంట్‌ను నమ్ముతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న సాయాన్ని ఆయన వివరించారు. బీబీనగర్ ఎయిమ్స్, సమ్మక్క-సారలమ్మ గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు వంటివి మోదీ సర్కార్ తెలంగాణపై చూపిస్తున్న ప్రేమకు నిదర్శనమన్నారు. 30 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్, 83 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చామని గుర్తు చేశారు. బూత్ స్థాయిలో మనం స్ట్రాంగ్ అయితే 2028లో తెలంగాణ గడ్డపై కమలం వికసించడం ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.
అరాచక సర్కార్‌ను ప్రజలే కూల్చేస్తారు: రాంచందర్ రావు
తెలంగాణను ధనిక రాష్ట్రం నుంచి అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ప్రజలే బుద్ధి చెబుతారని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అన్నారు. నితిన్ నబిన్ రాకతో ఢిల్లీ నాయకత్వం తెలంగాణను ఒక ప్రత్యేక మిషన్‌గా స్వీకరించిందని, అస్సాం, బెంగాల్ తరహాలోనే ఇక్కడ కూడా కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డెవలప్‌మెంట్ పనులకు బదులు హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చివేస్తూ పాలన ప్రారంభించిందని, ఈ అరాచక సర్కార్‌ను ప్రజలే ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చివేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. మూసీ ప్రక్షాళన పేరిట గాంధీ సరోవర్ వంటి భారీ ప్రాజెక్టులతో కాళేశ్వరం తరహాలో వేల కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. హిందూ టెంపుల్స్ పై దాడులు జరిగినప్పుడు బీజేపీ మాత్రమే గళమెత్తిందని, రాబోయే రెండేళ్లు కార్యకర్తలంతా టీమ్ బీజేపీగా ఐక్యంగా ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
ఎన్నికలు పెడితే కాంగ్రెస్‌కు
ఒక్క సీటూ రాదు: మహేశ్వర్ రెడ్డి
బీజేఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన ప్రామిసెస్ అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. అసెంబ్లీ సమావేశాలు పెడితే, పదేండ్ల బీఆర్ఎస్ రూలింగ్ పై, కాంగ్రెస్ రెండున్నర ఏళ్ల పాలనపై చర్చించడానికి తాము రెడీ అని చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే కర్ణాటక, తెలంగాణలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవబోదన్నారు. బెంగాల్ తరహాలోనే తెలంగాణలోనూ విన్ అవుతామని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకుల్లో భయం మొదలైంది:
ఎంపీ రఘునందన్‌రావు
ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. నితిన్ నబీన్ పర్యటనతో కాంగ్రెస్ నాయకుల్లో భయం మొదలైందన్నారు. యూరియా పంపిణీ చేయడం కూడా కాంగ్రెస్ సర్కారుకు చేతకావడం లేదని, ఆ అసమర్థతను బీజేపీ ఎంపీలపై రుద్దుతున్నారని ఫైర్ అయ్యారు. కేరళలో సర్ పూర్తి అయ్యాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనీ, పినరయి విజయన్ సీపీఎం ఓట్లు తొలగించి.. కాంగ్రెస్ ఓట్లు పెంచితే గెలిచారా అనేదానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహేష్ కుమార్ గౌడ్ ఎన్నడూ ఎన్నికల్లో నిలబడలేదని, గెలవలేదని విమర్శించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర ఇన్చార్జీలు సునీల్ భన్సల్, అభయ్ పాటిల్, ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, నగేశ్, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఇతర నేతలు పాల్గొన్నారు.
