వెలుగు ఓపెన్ పేజీ : విద్యార్థి సంక్షోభ పరిష్కారంలో వ్యవస్థ విఫలం

 వెలుగు ఓపెన్ పేజీ :  విద్యార్థి సంక్షోభ పరిష్కారంలో వ్యవస్థ విఫలం

ఒక విద్యార్థి  ఆత్మహత్య వార్త వచ్చిన  ప్రతిసారి మనం  పరీక్షల  ఒత్తిడిని,  మార్కుల  పోటీని  నిందిస్తాం.  కానీ విద్యార్థి  సహాయం కోసం చేయి చాచినప్పుడు  పట్టుకునే  వ్యవస్థ  నిజంగా ఉందా?  సుప్రీంకోర్టు  నియమించిన  జాతీయ పరిశోధన బృందం సమాధానం  దిగ్భ్రాంతికరంగా ఉంది.  2022లో  దేశవ్యాప్తంగా 13,000 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.  ఇది ఆ సంవత్సరం నమోదైన రైతుల ఆత్మహత్యల సంఖ్య కంటే  ఎక్కువ.  2025 మార్చి 24న ‘అమిత్ కుమార్  తదితరులు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో  సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. ఢిల్లీ ఐఐటీలో  ఇద్దరు విద్యార్థులు (అనిల్ కుమార్, ఆయుష్ అశ్నా) ఆత్మహత్య చేసుకున్న ఘటనల తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో విఫలమవడం ఈ తీర్పుకు నాంది. 

సుప్రీంకోర్టు స్వయంగా  రంగంలోకి దిగి, విద్యార్థుల మానసిక ఆరోగ్యం,  ఆత్మహత్యల నివారణకు జాతీయ పరిశోధన బృందం ( నేషనల్ టాస్క్​ఫోర్స్ – ఎన్టీఎఫ్ )ను  ఏర్పాటు చేసింది.  ఈ బృందానికి  సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి  ఎస్. రవీంద్ర భట్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.  మానసిక ఆరోగ్య,  విద్య,  సామాజికశాస్త్ర, చట్టం, వికలాంగుల హక్కులు,  లింగ సమానత్వ రంగాలకు చెందిన పదిమంది నిపుణులు సభ్యులుగా ఉన్నారు.  వీరిలో ప్రముఖ మానసిక  వైద్యుడు  డాక్టర్  అలోక్ సరిన్,  స్త్రీవాద పండితురాలు  ప్రొఫెసర్ మేరీ ఇ. జాన్,  వికలాంగుల హక్కుల నిపుణుడు  అర్మాన్ అలీ,  నిమ్హాన్స్  మనోవైద్య  నిపుణురాలు డాక్టర్ సీమా మెహ్రోత్రా తదితరులు ఉన్నారు. ఈ బృందం 2025  నవంబర్‌‌లో  మధ్యంతర నివేదికను  సుప్రీంకోర్టుకు సమర్పించగా  అది జూన్ 6, 2026న పబ్లిక్ డొమైన్‌‌లోకి వచ్చింది.  

కాగితాల మీదే  కౌన్సిలర్లు

విశ్వవిద్యాలయాల నియంత్రణ సంస్థ (యూజీసి) డేటా ప్రకారం  దేశవ్యాప్తంగా 1,456 సంస్థలు 27,136 మంది మానసిక సలహాదారులు (కౌన్సిలర్లు) తమ వద్ద ఉన్నట్లు నివేదించాయి. ఈ లెక్క ప్రకారం ప్రతి కళాశాలకు సగటున 18 మంది సలహాదారులు ఉన్నట్లు తేలుతుంది.  అయితే,  నివేదిక ఈ గణాంకాన్ని పూర్తిగా తప్పు పట్టింది.  యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన 50 సంస్థల్లో 47 సంస్థల్లో 'సలహాదారు' పేరుతో నమోదు చేసినవారు అసలు మానసిక  ఆరోగ్య నిపుణులు కాదు.  వారు అధ్యాపక సభ్యులు,  ఉద్యోగ  నియామక  సమన్వయకర్తలు,  నాణ్యతా నిర్ధారణ సభ్యులు, యోగా శిక్షకులు,   'సలహాదారు' అనే పదాన్ని అస్పష్టంగా, విస్తృతంగా ఉపయోగించడం  నివేదిక  తీవ్రంగా  విమర్శించింది.  వాస్తవ పరిస్థితి ఏమిటంటే  70%  కంటే  ఎక్కువ సంస్థల్లో  పూర్తి సమయం  మానసిక ఆరోగ్య నిపుణులు లేరు.  కేవలం 10% సంస్థల్లో మాత్రమే ఒకరు,  7% సంస్థల్లో 2-5 మంది నిపుణులు ఉన్నారు.  లక్షలాది మంది విద్యార్థులకు మద్దతుగా ఉండాల్సిన  సేవా వ్యవస్థ కాగితాల్లో మాత్రమే ఉన్న భ్రమ కల్పించే పరిస్థితి ఏర్పడింది.

విద్యార్థుల మానసిక స్థితిని 
ముందస్తుగా పరిశీలించాలి

పరిశోధన బృందం సర్వే చేసిన సంస్థల్లో 4% కంటే తక్కువ సంస్థల్లోనే అధికారిక ఆత్మహత్య నివారణ ప్రమాణ విధానాలు (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోసిడ్యూర్ ) ఉన్నాయి.  అంటే  96%  కళాశాలల్లో విద్యార్థికి  ఆత్మహత్య  ఆలోచనలు వస్తున్నాయని తెలిసినా,  ఏమి చేయాలో,  ఎవరిని ఆశ్రయించాలో,  ఎలా  రక్షించాలో  ఎలాంటి మార్గదర్శకాలు లేవు.  45% సంస్థలు గత 18 నెలల్లో  అధ్యాపక  చైతన్య కార్యకలాపాలు కూడా నిర్వహించలేదు. నివేదిక  క్షేత్ర పర్యటనల్లో ఒక ప్రముఖ  ఇంజినీరింగ్  కళాశాల  సలహాదారులు చేసిన  వాదన  గుర్తుంచుకోవాలి.  ‘ఇటీవలి  సంవత్సరాల్లో ఆత్మహత్య చేసుకున్న తమ కళాశాల విద్యార్థులు ఎవరూ ముందుగా మమ్మల్ని సంప్రదించలేదు’.  అని తెలిపారు.  దీనికి కారణం, విద్యార్థుల మానసిక స్థితిని ముందస్తుగా పరిశీలించే,  అధ్యాపకులు,  హాస్టల్ సిబ్బంది,  సలహాదారుల మధ్య సమన్వయం చేసే విధానం లేకపోవడమే.

సలహాదారులపై అవిశ్వాసం

చాలా సంస్థల్లో  సేవలు ఉన్నా.. సలహాదారులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటారు.  వైద్య,  ఇంజినీరింగ్ విద్యార్థులకు  అత్యంత  బిజీ  దినచర్య  ఉండటంతో,  రాత్రివేళ వారాంతాల్లో  కుంగిపోయిన  విద్యార్థికి సహాయం అందదు.  ఇంతకంటే  ప్రాణాంతకమైన  సమస్య  గోప్యతపై  అవిశ్వాసం.   క్షేత్ర పర్యటనల్లో  విద్యార్థులు స్పష్టంగా చెప్పిన విషయం  ఏమిటంటే..  సలహాదారుడిని  ఆశ్రయిస్తే, తమ సమస్యలు  అధ్యాపకులకు,  పరిశోధన  మార్గదర్శకులకు,  తల్లిదండ్రులకు చేరతాయనే భయం.  ఒక కేంద్ర విశ్వవిద్యాలయంలో మానసిక సహాయం తీసుకుంటే పరిశోధన మార్గదర్శకుడికి సమాచారం చేరి  చదువుపై  పరిణామాలు  ఎదురవుతాయనే  భయంతో  విద్యార్థులు  దూరంగా  ఉంటున్నారు.  ఈ అవిశ్వాసమే  మానసిక  ఆరోగ్య  సేవలను  పూర్తిగా  నిరుపయోగంగా మార్చేస్తోంది.  విద్యార్థి  తన  సమస్యను  చెప్పుకుంటే ‘చదువులో వెనుకబడిపోతాను’  లేదా  ‘తోటి విద్యార్థులు నన్ను తక్కువ చేసి చూస్తారు’ అనే  సామాజిక కళంకం పోవాలంటే,  విద్యా సంస్థల యాజమాన్యాలు దీనిని ఒక  ‘క్రమశిక్షణ సమస్య’గా కాకుండా, ‘ఆరోగ్య సమస్య’గా గుర్తించాలి.

మానసిక ఆరోగ్యం..ప్రాథమిక హక్కు

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సుక్దేబ్ సాహా కేసులో కీలక తీర్పు ఇచ్చింది.  ‘మానసిక క్షేమం అనేది జీవించే హక్కు (రాజ్యాంగం అధికరణ 21) నుంచి విడదీయరానిది’.  అంటే  ప్రతి విద్యార్థికి  మానసికంగా ఆరోగ్యంగా ఉండే వాతావరణాన్ని,  సేవలను అందుబాటులో ఉంచడం  కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు,  విద్యా సంస్థల రాజ్యాంగ బాధ్యత.   పరిశోధన బృందం తన సిఫార్సుల్లో  స్పష్టం చేసింది.  ప్రతి సంస్థలో  పూర్తి సమయం,  అర్హత  కలిగిన మానసిక ఆరోగ్య  నిపుణులు ఉండాలి.  మానసిక సేవల్లో  గోప్యతకు పూర్తి హామీ ఇవ్వాలి.  ప్రతిరోజూ 24 గంటలూ సేవలు అందుబాటులో ఉంచాలి.  ప్రతి  విద్యార్థి  మానసిక స్థితిని ముందస్తు పరీక్ష ద్వారా అంచనా వేయాలి.  అధ్యాపకులకు  ప్రారంభ దశలో  గుర్తించే  ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.   ప్రతి క్యాంపస్‌‌లో,  ప్రతి విద్యార్థి  భయం లేకుండా, అవమానం లేకుండా సహాయం  అడగగలిగే  వాతావరణం ఉండాలి.  ప్రతి విద్యార్థి ఆత్మహత్య వెనుక ఒక కల కాదు,  ఒక దేశ భవిష్యత్తు కూడా చనిపోతోంది. 

- వంగవోలు రవి
ఉపాధ్యాయుడు & 
విద్య, సామాజిక 
అంశాల విశ్లేషకుడు

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.