- 3 నెలల్లో వంగూరు, మంచాల, పోల్కంపల్లి బడులు సిద్ధం
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడి రూపురేఖలు మార్చేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ (టీపీఎస్) ప్రాజెక్టు ఇప్పుడు టాప్ గేర్‌లో దూసుకుపోతున్నది. గత నెల 17న ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి మంచి మైలేజీ వచ్చింది. దీంతో పలు నియోజకవర్గాల్లో ఇలాంటి పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు, ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఆరుట్ల టీపీఎస్ మినహా మంచాల, వంగూరు, పోల్కంపల్లి టీపీఎస్‌లపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన స్కూళ్ల నిర్మాణాలను మూడు నెలల్లో పూర్తి చేయాలని విద్యా కమిషన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
ప్రత్యక్ష పర్యవేక్షణ..
తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ప్రత్యేక పర్యవేక్షణలో ఇప్పటికే ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ పూర్తయింది. వంగూరు టీపీఎస్ పర్యవేక్షణ బాధ్యతలను డాక్టర్ చారకొండ వెంకటేశ్, మంచాల టీపీఎస్ పనులను జోష్ణ శివారెడ్డి, పోల్కంపల్లి టీపీఎస్ నిర్మాణాలను ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఆయా స్కూళ్లలో సాగుతున్న నిర్మాణ పనులను విభజించి, స్కూల్ ప్రిన్సిపాల్ నేతృత్వంలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులకు పనుల విభజన చేశారు. ప్రతి బుధవారం, శనివారం ఎస్‌ఎంసీ సభ్యులు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పనుల పురోగతిని విశ్లేషిస్తున్నారు. ఈ 3 పైలెట్ ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తయితే రాష్ట్రంలో ప్రభుత్వ విద్య నాణ్యత పెంపునకు ఈ ప్రాజెక్టు కీలక మలుపు కానున్నది.
