మహబూబ్నగర్: ఊళ్లోనే ఓట్లుండాలే...మా ఓట్లు తీసేయొద్దు..బీఎల్వోలను కోరుతున్న వలస ఓటర్లు

మహబూబ్నగర్: ఊళ్లోనే ఓట్లుండాలే...మా ఓట్లు తీసేయొద్దు..బీఎల్వోలను కోరుతున్న వలస ఓటర్లు
  •     త్వరలో గ్రామాలకు వచ్చి వివరాలు ఇస్తామని వెల్లడి
  •     ఏరువాక పున్నం కావడంతో గ్రామాలకు చేరుకున్న పలువురు కూలీలు
  •     పని చేసే ప్రదేశంతో పాటు సొంతూళ్లో చాలా మందికి డబుల్​ ఓట్లు!

మహబూబ్​నగర్​, వెలుగు : ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్​ ఇంటెన్సివ్​ రివిజన్​ (సర్​) కార్యక్రమం ఉమ్మడి మహబూబ్‌‌నగర్ జిల్లాలో ప్రారంభం కావడంతో వలస కూలీలలో తమ ఓటు హక్కుపై ఆందోళన మొదలైంది. ఉపాధి కోసం ఆయా నగరాలకు వలస వెళ్లిన వేలాది కుటుంబాల్లో కొందరికి అటు పని చేసే చోట, ఇటు స్వగ్రామాల్లో డబుల్ ఓట్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఎక్కడో ఒకచోట మాత్రమే ఓటు హక్కు ఉండాలనే రూల్ రావడంతో, తమ ఓట్లను సొంత ఊర్లోనే ఉంచాలని కూలీలు కోరుతున్నారు. తమ భూములు, ఆస్తులు గ్రామాల్లోనే ఉన్నాయని, గ్రామంలోని ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించవద్దని బీఎల్​వోలను  ఫోన్ల ద్వారా వేడుకుంటున్నారు.

వసల కూలీలకు అవగాహన కల్పిస్తున్న బీఎల్​వోలు.. 

దశాబ్దాలుగా జిల్లాలోని గండీడ్, మహ్మదాబాద్, మద్దూరు, కొత్తపల్లి, ధన్వాడ, నారాయణపేట, దామరగిద్ద, కోయిల్ కొండ వంటి పలు మండలాల నుంచి వేలాది కుటుంబాలు ఉపాధి కోసం ముంబై, పుణె, షోలాపూర్, భీవాండి, హైదరాబాద్ వంటి  నగరాలకు వలస వెళ్లాయి. వీరిలో చాలా మందికి వారు పని చేస్తున్న ప్రాంతంతో పాటు సొంతూళ్లల్లో డబుల్​ ఓట్లు కలిగి ఉన్నారు. డబుల్​ ఓట్లు తొలగింపు, చనిపోయిన వారి పేర్లను, ఇతర దేశాల నుంచి వచ్చిన వారి ఓట్లను తొలగించేందుకు ఎన్నికల సంఘం ‘సర్’  కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభించింది. 

ఈ మేరకు బీఎల్​వోలను వారి బూత్​ పరిధిలోని ప్రతి ఇంటికీ తిరిగి ఎన్యుమరేషన్​ ఫారాలను అందిస్తున్నారు. వలస కూలీలు ఉన్న తండాలు, గ్రామాల్లో వారు అందుబాటులో లేకపోవడంతో వారి ఇంటి పక్కన ఉన్నవారికి, వారి బంధువులకు ఈ ఫారాలను అప్పగిస్తున్నారు.  వలస కూలీల ఫోన్​ నంబర్లను సేకరించి, వారితో మాట్లాడుతున్నారు. ‘మీ ఇంటి వద్దకు వచ్చాం. మీ ఎన్యుమరేషన్​ ఫారం నింపాలి. గ్రామంలో మీ పేరు మీద ఓటు ఉంది. మీకు, మీరు పని చేస్తున్న చోట కూడా ఓటు హక్కు ఉందా? ఉంటే మీకు అక్కడే ఓటు హక్కు ఉండాలా? మీ గ్రామంలోనే ఓటు హక్కు కావాలా? డబుల్​ ఓట్లు ఉంటే, ఎక్కడో ఒక చోట మాత్రమే ఓటు హక్కును కలిగి ఉండాలి. 

మీ ఓటును మీరు పని చేస్తున్న ప్రాంతానికి షిఫ్ట్​ చేయాలా? లేక ఇక్కడే ఉంచాలా? ఇక్కడే ఉంచితే మీరు పని చేస్తున్న చోట మీకు ఓటు హక్కు రద్దు అవుతుంది’ అని వలస కూలీలకు అర్థమయ్యేలా అవగాహన కల్పిస్తున్నారు. చాలా మంది కూలీలు తమ భూములు, ఆస్తులు గ్రామాల్లోనే ఉన్నాయని, ఓటు హక్కును అక్కడే కల్పించాలని బీఎల్​వోలను కోరుతున్నారు. ఎన్యుమరేషన్​ ఫారాల మీద సంతకాలు చేయడానికి, ఫొటోలు ఇవ్వడానికి త్వరలో ఊళ్లకు వస్తామని చెబుతున్నారు. సోమవారం ఏరువాక పున్నం సందర్భంగా పండుగ చేసుకోవడానికి వచ్చిన పలువురు కూలీలు బీఎల్​వోలకు వారి సమాచారం ఇచ్చి తిరిగి వెళ్లిపోయారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వలస ఓటర్లు.. 

దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లా నుంచి వేల కుటుంబాలు ఉపాధి కోసం వలస పోతున్నాయి. తట్ట, మట్టి, పార పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వలస పోయిన వారంతా అత్యవసరం అయితే తప్ప స్వగ్రామాలకు తిరిగి రారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వీరు ఎక్కడున్నా లీడర్లు పోలింగ్​ తేదీ నాటికి వారిని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి సొంతూళ్లకు తీసుకొస్తారు. పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీరి ఓట్లే గెలుపోటములకు కీలకం కావడంతో లక్షల్లో ఖర్చు చేసైనా వీరి ఓట్లను గంప గుత్తగా వేయించుకునేందుకు ప్రయత్నం చేస్తారు. 

సొంతూళ్లనే ఓటు ఉండాలె

మాది చెన్నారెడ్డిపల్లి. నేను, నా భార్య పిల్లలు హైదరాబాద్​లోని లంగర్ హౌస్​లో ఉన్న ఓ కంపెనీలో పని చేసుకుంటూ బతుకుతున్నాం. ఉన్న ఊళ్లో ఉపాధి లేక వలస వచ్చాం. మా కుటుంబానికి డబుల్ ఓట్లు లేవు. మాకు సొంతూళ్లనే ఓట్లు ఉన్నాయి. అక్కడే మాకు ఓట్లు కావాలి. మా భూములు కూడా ఊళ్లనే ఉన్నయి.

- ఎన్.అనంత్ రెడ్డి, వలస కూలీ, చెన్నారెడ్డిపల్లి గ్రామం, మద్దూరు మండలం

ఎప్పటికైనా సొంతూరికి రావాల్సిందే

నేను, నా కుటుంబంతో కలిసి పదేండ్ల కిందట ముంబైకి వలస వచ్చినం. ఇక్కడే పనులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నం. ఊళ్లనే మాకు భూమి, సొంత ఇల్లు ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఊరికి వచ్చి ఓట్లు వేస్తున్నం. ఇప్పుడు ఓటు ఎక్కడ కావాలి అని అడిగినరు. సొంతూళ్లనే కావాలని చెప్పిన. త్వరలో ఊరికి వచ్చి పూర్తి సమాచారం ఇస్తానన్న. బతకనికే ముంబై వచ్చినం. ఎప్పటికైనా సొంతూరికి పోవాల్సిందే కదా. 

- ఇసువప్ప, వలస కూలీ, మల్​రెడ్డిపల్లి, కోస్గి  మండలం