గ్రామం దేశానికి వెన్నెముక అయితే గ్రామ పంచాయతీ ప్రజాస్వామ్యానికి పునాది. కానీ, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కాదు. గ్రామానికి సంబంధించిన నిర్ణయాలు గ్రామంలోనే తీసుకునే అధికారం, ఆ నిర్ణయాలను అమలుచేసే సిబ్బంది, వాటికి సరిపడే నిధులు.. ఈ మూడు కలిసినప్పుడే పంచాయతీ నిజమైన స్థానిక స్వపరిపాలనా సంస్థగా మారుతుంది. రాజ్యాంగంలోని 73వ సవరణ లక్ష్యం కూడా ఇదే. ఈ విషయంలో తెలంగాణలో అనేక సనాళ్లు ఎదురవుతున్నాయని చెప్పాలి. 2025–-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం అన్‌టైడ్ గ్రాంట్ తొలి విడతను విడుదల చేసినట్లు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రికార్డులు చెబుతున్నాయి. అయితే నిధులు రావడం ఒక అంశం. వాటిని పంచాయతీ తన ప్రాధాన్యతల ప్రకారం స్వతంత్రంగా ఖర్చు చేయగలగడం మరో అంశం. ఇక్కడే ‘నేరుగా నిధులు– నేరుగా అధికారాలు’ అనేది కీలకంగా మారుతుంది.
కేరళ చూపించిన మార్గం
1996లో ప్రారంభమైన ‘పీపుల్స్ ప్లాన్’ ద్వారా కేరళ స్థానిక సంస్థలకు భారీ స్థాయిలో నిధులు, విధులు, సిబ్బంది బదలాయింపును చేపట్టింది. రాష్ట్ర ప్రణాళిక నిధుల్లో 35–40 శాతం వరకు స్థానిక సంస్థలకు కేటాయించే నిర్ణయం అప్పట్లో తీసుకుంది. గ్రామసభలు స్థానిక అవసరాలను గుర్తించడం నుంచి అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన వరకు కీలక పాత్ర పోషించే విధానం ఏర్పడింది. ఒడిశాలో కూడా పంచాయతీలకు నిధుల వికేంద్రీకరణలో స్పష్టమైన విధానం కనిపిస్తుంది. రాష్ట్ర ఐదో ఆర్థిక సంఘం కాలంలో డివల్యూషన్ గ్రాంట్లను గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్‌ల మధ్య 60:30:10 నిష్పత్తిలో కేటాయించే విధానం అమలులో ఉంది. ఆ నిధులను స్థానికంగా గుర్తించిన అవసరాలకు ఉపయోగించుకునేలా అన్‌టైడ్‌గా ఉంచినట్లు రాష్ట్ర పత్రాలు చెబుతున్నాయి.
వికేంద్రీకరణ అసంపూర్ణం
పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కావల్సినవి.. నిధులు, విధులు, సిబ్బంది. నిధులు ఇచ్చి పనులు అప్పగించకపోతే ప్రయోజనం లేదు. పనులు అప్పగించి సిబ్బందిని ఇవ్వకపోతే పంచాయతీ చేతులు కట్టేసినట్టే. సిబ్బంది, విధులు ఇచ్చి నిధులు ఇవ్వకపోతే అవి కాగితంపై ఉన్న అధికారాలుగానే మిగిలిపోతాయి. తెలంగాణలో ఇకపై పంచాయతీరాజ్ సంస్కరణల చర్చ ‘ఎంత నిధులు ఇచ్చారు?’ అనే ప్రశ్నకే పరిమితం కాకూడదు. ‘ఎన్ని విధులు బదలాయించారు?’, ‘ఎంతమంది సిబ్బంది పంచాయతీ నియంత్రణలో ఉన్నారు?’, ‘ఎంత నిధిని పంచాయతీ స్వయంగా నిర్ణయించగలదు?’ అనే ప్రశ్నలకు కూడా సమాధానం కావాలి. పంచాయతీకి ‘గ్రాంట్’ కాదు, ‘హక్కు’ కావాలి. జనాభా మాత్రమే కాకుండా వెనుకబాటుతనం, భౌగోళిక పరిస్థితులు, ఆదాయ సామర్థ్యం, మౌలిక వసతుల లోటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నిధుల పంపిణీ జరగాలి.
సుపరిపాలనకు పంచ మార్గాలు
తెలంగాణలో పంచాయతీరాజ్‌ను నిజమైన స్వపరిపాలనగా మార్చాలంటే ఐదు నిర్ణయాలు అవసరం. మొదటిది.. నేరుగా నిధులు. రాష్ట్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన వాటాను
స్పష్టమైన ఫార్ములాతో, నిర్ణీత కాలపట్టికలో విడుదల చేయాలి. రెండోది.. అన్‌టైడ్ నిధులు. ప్రతి గ్రామ సమస్య ఒకే ప్రభుత్వ పథకం నిబంధనలకు సరిపోదు. గ్రామసభ గుర్తించిన అత్యవసర అవసరాలకు కొంత నిధిని పంచాయతీ స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం ఉండాలి. మూడోది.. విధుల బదలాయింపు. గ్రామీణ పారిశుద్ధ్యం, చిన్న మౌలిక వసతులు, స్థానిక ఆస్తుల నిర్వహణ, గ్రామాభివృద్ధి వంటి అంశాల్లో పంచాయతీకి స్పష్టమైన నిర్ణయాధికారం ఇవ్వాలి. నాలుగోది..సిబ్బంది. పంచాయతీ కార్యదర్శి నుంచి సాంకేతిక సిబ్బంది వరకు ఎవరు ఎవరికి బాధ్యత వహిస్తారో స్పష్టంగా ఉండాలి. ఐదోది.. బాధ్యత కూడా అంతే బలంగా ఉండాలి. రాష్ట్ర రాజధానిలో కూర్చొని గ్రామానికి ఏంకావాలో నిర్ణయించడం కంటే, గ్రామసభలో కూర్చొని గ్రామమే తన అవసరాలను నిర్ణయించుకునే అధికారం ఉండాలి. అధికారుల ఆదేశాలతో గ్రామం నడవడం కాదు. పంచాయతీకి పగ్గాలు ఇచ్చినప్పుడే పల్లెకు ప్రగతి వేగం పెరుగుతుంది.
- రేణుక వెంకట్,
రాష్ట్ర అధ్యక్షురాలు,
మహిళా సర్పంచ్ ల ఫోరం
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
