వానకాలంలో ప్రతి ఎకరాకు సాగునీరు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

వానకాలంలో  ప్రతి ఎకరాకు సాగునీరు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

హసన్ పర్తి/ రఘునాథపల్లి (స్టేషన్​ఘన్​పూర్)​, వెలుగు: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వానకాలం సీజన్‌‌లో ఒక్క ఎకరా భూమి ఎండిపోకూడదని, ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇరిగేషన్ ఆఫీసర్లను ఆదేశించారు. హనుమకొండ చింతగట్టు నీటిపారుదల చీఫ్ ఇంజినీర్ ఆఫీస్​లో హనుమకొండ, ములుగు జిల్లాల చీఫ్ ఇంజినీర్లు, ఇతర ఇరిగేషన్ ఆఫీసర్లతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. 

దేవాదుల ఫేజ్-1, 2, 3 మోటర్లను జులై 1న ప్రారంభించి, నెల రోజుల పాటు నిరంతరాయంగా రిజర్వాయర్లకు నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. జులై 15 నుంచి కాలువల ద్వారా పంట పొలాలకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అంతకుముందు ఆయన చిల్పూర్​ వెంకటేశ్వర్లపల్లిలో సీసీ రోడ్ల శంకుస్థాపన, ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. రాజవరం కస్తూర్భా స్కూల్​లో పలు పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం చిల్పూర్​ మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్​ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.