జనగామ అర్బన్/ ఖిలా వరంగల్, వెలుగు: వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిని ‘జీరో ఫటాలిటీ కారిడార్’గా తీర్చిదిద్దేందుకు సమగ్ర భద్రతా చర్యలను వేగవంతం చేయాలని వరంగల్ సీపీ శ్వేత, ములుగు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం జనగామ కలెక్టరేట్‌లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు.
జిల్లాలో 46 జంక్షన్లు, అనధికారిక పార్కింగ్ ప్రాంతాలను గుర్తించినట్లు సీపీ తెలిపారు. పల్లగుట్ట, మీదికొండ, గోవర్ధనగిరి, రాఘవాపూర్ తదితర ప్రాంతాల్లో రంబుల్ స్ట్రిప్స్, డ్రైనేజీ, వీధి దీపాలు, క్రాష్ బారియర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటును త్వరగా చేపట్టాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ రాజమహేంద్ర నాయక్ హెచ్చరించారు. అనంతరం జనగామ భరోసా కేంద్రాన్ని సీపీ శ్వేత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాధితులకు అందుతున్న కౌన్సిలింగ్, న్యాయ, వైద్య సహాయం, మానసిక పరామర్శ, పునరావాస సేవలను పరిశీలించారు. బాధితుల గోప్యతకు ప్రాధాన్యం ఇస్తూ, అవసరమైన సహాయాన్ని సత్వరం అందించాలని ఆఫీసర్లను ఆదేశించారు.
700 ఇండ్లలో కార్డన్ అండ్ సెర్చ్..
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ శ్వేత కోరారు. శుక్రవారం మిల్స్ కాలనీ పరిధిలోని శివనగర్, ఏసీ రెడ్డి నగర్, పుప్పాలగుట్టలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. 130 మంది పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి 700 ఇండ్లను తనిఖీ చేశారు. రెండు బెల్ట్ షాపులు, 67 వాహనాలను తనిఖీ చేసి, 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని
విచారించారు.
