రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. హైవేపై ట్రక్‎ను ఢీకొట్టిన బస్సు.. 8 మంది సజీవ దహనం

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. హైవేపై ట్రక్‎ను ఢీకొట్టిన బస్సు.. 8 మంది సజీవ దహనం

జైపూర్: రాజస్థాన్‎లో ఘోర ప్రమాదం జరిగింది. దౌసా జిల్లాలోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ట్రక్‎ను ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగి 8 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బుధవారం (జులై) తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. 

ప్రమాదానికి గురైన బస్సు 37 మంది ప్రయాణికులతో రిషికేశ్ నుంచి ఇండోర్‌కు వెళ్తున్న క్రమంలో యాక్సిడెంట్ జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జు అయ్యింది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటన స్థలం భీతావాహంగా మారింది. 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సహాయక చర్యలకు వీలు కల్పించేందుకు, ప్రమాద స్థలాన్ని క్లియర్ చేసేందుకు పోలీసులు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించారు. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ సంతాపం తెలిపారు.