ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ శివార్లలోని బొంగుళూరు సాగర్ రహదారిపై సినిమా ఫక్కీలో పోలీసుల కాల్పులు చోటుచేసుకున్నాయి. రెండు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్న ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునే క్రమంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దోపిడీలు, భారీ చోరీ కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న నిందితుడు భూషని శ్రీకాంత్ కదలికలపై పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో నల్గొండ సిసిఎస్ పోలీసులు, స్థానిక పోలీసులు కలిసి బొంగుళూరు సాగర్ హైవేపై నిందితుడిని చుట్టుముట్టారు.అయితే పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో నిందితుడు శ్రీకాంత్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. పోలీసులపైకి తిరగబడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో నల్గొండ సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన గిరికి స్వల్ప గాయాలయ్యాయి.
నిందితుడు లొంగిపోకుండా పారిపోతుండటంతో.. పోలీసులు పలుమార్లు హెచ్చరించారు. అయినా వినకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూషని శ్రీకాంత్‌ను పోలీసులు విజయవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనతో సాగర్ హైవేపై ఒక్కసారిగా ఉత్కంఠ రేగింది. ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని పోలీస్ శాఖ తెలిపింది.
