బూర్గంపహాడ్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో భారీ గంజాయి రవాణాను ఈగల్ ఫోర్స్ టీం, జిల్లా పోలీసులు సంయుక్తంగా భగ్నం చేశారు. ఏపీ నుంచి యూపీకి సినీ ఫక్కీలో కంటైనర్‌లో తరలిస్తున్న సుమారు రూ.2.62 కోట్ల విలువైన 525 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సహదేవ్ హంటల్ అటవీ ప్రాంతాల్లో గంజాయిని సేకరించి, ఏపీలోని తులసిపాకకు కూలీల ద్వారా తరలించేవాడు. అక్కడి నుంచి మహ్మద్ సైఫ్, ఫిరోజ్ భాయ్ కు చెందిన ప్రత్యేకంగా మార్పులు చేసిన కంటైనర్ లారీలో యూపీకి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో ఈగల్ ఫోర్స్ టీం.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల సహకారంతో సారపాక గోదారమ్మ క్యాంప్ వద్ద తనిఖీలు నిర్వహించింది. అనుమానాస్పదంగా ఉన్న కంటైనర్ లారీని గుర్తించి తనిఖీ చేయగా అందులో రహస్యంగా ఏర్పాటు చేసిన గది బయటపడింది. అందులో భారీగా గంజాయి బ్యాగులు లభ్యమయ్యాయి. ఈ కేసులో సహదేవ్ హంటల్, యూపీకి చెందిన లారీ డ్రైవర్ కుల్దీప్ శర్మ, కంటైనర్‌కు ఎస్కార్ట్‌గా బైక్‌పై వస్తున్న మారేడిమిల్లికి చెందిన త్రినాథ్ ను
అరెస్టు చేశారు.
