గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం..విద్య ద్వారానే సామాజిక వికాసం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం..విద్య ద్వారానే సామాజిక వికాసం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

మధిర, వెలుగు : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో రూ. 7.66 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శనివారం కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

 ఈ సందర్భంగా బోనకల్ మండలం చొప్పకట్లపాలెం గ్రామం నుంచి దబ్బాకుపల్లి గ్రామం వరకు బీటీ లింక్ రోడ్డు, చొప్పకట్లపాలెం ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు, రామాపురం నుంచి పాతర్లపాడు వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్ల నిర్మాణంతో గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం కానున్నాయని చెప్పారు.

 నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచుతామన్నారు. అనంతరం బోనకల్ యంగ్ ఇండియా స్కూల్ పనులను పరిశీలించారు. తరగతి గదులు, హాస్టల్, సైన్స్, కంప్యూటర్స్ ల్యాబ్స్, కిచెన్, డైనింగ్ హాల్ ను పరిశీలించారు.  విద్య ద్వారానే సామాజిక వికాసం, అక్షరం ద్వారానే అంతరాలు లేని సమాజం సాధ్యం అవుతుందన్నారు. 

స్కూల్ నిర్మాణ పనుల్లో ఆలస్యం, అలసత్వం ఉండకూడదని, పనులను స్పీడ్ గా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో పీఆర్ ఎస్ ఈ వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్ ఈ యుగంధర్ రావు, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.