నాగర్‌‌కర్నూల్ జిల్లాలో ఓటర్లకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి : కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

నాగర్‌‌కర్నూల్ జిల్లాలో ఓటర్లకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి :   కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్ టౌన్/కల్వకుర్తి, వెలుగు :  నాగర్‌‌కర్నూల్ జిల్లాలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, రానున్న రెండు రోజుల్లో వంద శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తహసీల్దార్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని మొత్తం 7,31,632 మంది ఓటర్లలో ఇప్పటికే 65.9 శాతం ఫారాలు పంపిణీ చేశామని, మిగతావికూడా బీఎల్ఓల ద్వారా ఇంటింటికీ వెళ్లి అందించి, రోజువారీ డేటాను ఆన్‌‌లైన్ చేయాలన్నారు. అంతకుముందు తాడూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఈ పంపిణీ ప్రక్రియను ఆయన పరిశీలించారు. 

ఉర్కొండలో పర్యటన.. 

జూలై 4న సీఎం రేవంత్ రెడ్డి ఉర్కొండ పర్యటన నేపథ్యంలో, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ కలిసి ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఉర్కొండలోని పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ దర్శన ఏర్పాట్లు, హెలిప్యాడ్, భద్రతతో పాటు ప్రతిపాదిత ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయం, నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణ స్థలాలను తనిఖీ చేశారు. రైతు వేదికలో నిర్వహించిన సమీక్షలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను సక్సెస్​ చేయాలన్నారు.  రైతులకు యూరియా-విత్తనాల సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.