గుడ్ న్యూస్.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు

గుడ్ న్యూస్.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు

న్యూఢిల్లీ: దేశ వాణిజ్య రంగానికి కేంద్రం భారీ ఊరట కల్పించింది. ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ల ధరను భారీగా తగ్గించింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.183.50 మేర తగ్గించాయి. సవరించిన ధరలు 2026, జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కాగా, పశ్చిమాసియా ఇంధన సంక్షోభంతో గ్యాస్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అమెరికా, ఇరాన్ యుద్ధంతో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా ముడి చమురు, గ్యాస్‌ రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

ఇటీవల ఇరాన్-అమెరికా మధ్య ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదిరి యుద్ధం ఆగిపోవడంతో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే ఆయిల్ కంపెనీలు గ్యాస్ ధరలను తగ్గించాయి. ఈ ఏడాదిలో కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గడం ఇదే మొదటిసారి. ఈ నిర్ణయం హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు వ్యాపారులకు భారీ ఉపశమనం కలగనుంది. ఈ తగ్గింపు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 3,113.50 నుంచి రూ. 2,930కి చేరింది.

డొమెస్టిక్ రేట్లలో నో ఛేంజ్..!

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించిన ఆయిల్ కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఇళ్లలో ఉపయోగించే14.2 కేజీల వంట గ్యాస్ ధరలు యథాతథంగా ఉన్నాయి. దీంతో గృహ వినియోగదారులకు ఎలాంటి ఉపశమనం కలగలేదు.