చెన్నై: తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర రవాణా రంగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. ప్రజా రవాణాను మరింత సుఖమయం చేసేందుకు ఇకపై కేవలం ఏసీ బస్సులను మాత్రమే కొనుగోలు చేయాలని సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విజయ్ తమిళన్ పార్థిబన్ అధికారికంగా వెల్లడించారు.
సేలంలో జరిగిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పార్థిబన్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు సుదూర ప్రాంతాలకు సౌకర్యవంతంగా ఏసీ బస్సుల్లో ప్రయాణించాలన్నదే సీఎం ఆశయమని తెలిపారు.
సామాన్యుడి నుంచి సీఎం వరకు ఒకేలా..
ఇటీవల సీఎం విజయ్ స్వయంగా ఒక బస్సులో ప్రయాణించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. ఆ అనుభవంతోనే భవిష్యత్తులో రవాణా శాఖ కొనుగోలు చేసే ప్రతి కొత్త బస్సులోనూ విధిగా ఏసీ సౌకర్యం ఉండాలని ఆయన నిర్ణయించారని మంత్రి పార్థిబన్ చెప్పారు.
సామాన్య ప్రయాణికుడి నుంచి సీఎం వరకు ప్రతి ఒక్కరూ గర్వంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేలా ప్రభుత్వ బస్సులు రూపుదిద్దుకోవాలని సీఎం ఆదేశించినట్టు పేర్కొన్నారు. తమిళనాడులోని ప్రతి మారుమూల గ్రామానికి కూడా బస్సు నెట్‌వర్క్‌ను అనుసంధానించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
