భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: టెన్త్ పరీక్షలో అసలు అభ్యర్థికి బదులుగా మరొకరు పరీక్ష రాసిన కేసులో ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె.సాయి మంగళవారం తీర్పు ఇచ్చారు.
లిటిల్ బర్డ్స్ స్కూల్ లో 2019లో నిర్వహించిన టెన్త్ సోషల్ పరీక్ష సమయంలో స్క్వాడ్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో హాల్ టికెట్‌ను పరిశీలించగా, తెల్లం అనిల్ స్థానంలో పూనెం సందీప్ పరీక్ష రాస్తున్నట్లు గుర్తించింది. ఈ ఘటనపై పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ కుసుమ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి కొత్తగూడెం వన్‌టౌన్ ఎస్సై పి.రామయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టు విచారణలో ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు, పత్రాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితులపై నేరం రుజువైందని తేల్చింది.
మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నార్సింగ్ అనిల్ కుమార్ వాదనలు వినిపించారు. కోర్టు నోడల్ అధికారిగా ఎస్సై డి. రాఘవయ్య, కోర్టు డ్యూటీ అధికారిగా డి. కామేశ్వరరావు వ్యవహరించారు.
