తెలంగాణలోని ప్రధాన ఆలయాలకు మహర్దశ పడుతున్నది. తెలంగాణ వచ్చాక పదేండ్లలో ఒక్క యాదాద్రి ఆలయం నిర్మాణం చేపడ్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కేవలం రెండున్నరేళ్లలో రూ.2,216 కోట్లతో 20 ప్రధాన ఆలయాల పునర్ నిర్మాణ పనులను భుజానికెత్తుకున్నది. 11 ప్రధాన ఆలయాల్లో చేపడ్తున్న విస్తరణ పనులు వివిధ దశల్లో ఉండగా, మరో 9 ముఖ్యమైన టెంపుల్స్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్స్ సిద్ధమయ్యాయి.
వేములవాడ, బాసర, భద్రాద్రి, కాళేశ్వరం దేవస్థానాల్లో ఇప్పటికే పనులు జోరుగా సాగుతున్నాయి. కొండగట్టు, ధర్మపురి, జోగులాంబ, పెద్దమ్మ, భద్రకాళి, కీసర, చెరువుగట్టు పనులకు టెండర్లు చివరిదశకు చేరుతున్నాయి. మేడారంలోనూ రూ.101 కోట్లతో సమ్మక్క-సారలమ్మ గద్దెల పునరుద్ధరణ, అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేసిన సంగతి తెలిసిందే. వేములవాడ సహా దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న ఆలయాల్లో విస్తరణ పనులు జోరుగా సాగుతుండడంపై భక్తుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
తొమ్మిది ఆలయాలకు మాస్టర్‌ప్లాన్ రెడీ..
రాష్ట్రంలోని మరికొన్ని ఆలయాలకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. హైదరాబాద్‌లోని కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం, సిద్ధిపేటలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి, హన్మకొండ జిల్లాలోని ఐనవోలు మల్లికార్జునస్వామి, మడికొండలోని మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి, ఖమ్మం జిల్లాలోని జమలాపురం వెంకటేశ్వర స్వామి, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవస్థానం, సికింద్రాబాద్ తాడ్ బండ్ వీరాంజనేయ స్వామి, మెదక్ ఏడుపాయల వన దుర్గ భవాని ఆలయాల అభివృద్ధి చేయనున్నారు. ఈ మాస్టర్ ప్లాన్ అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి గడువులోగా పనులు పూర్తిచేసేలా పర్యవేక్షించనున్నారు.
