మన దేశంలో పాత బంగారం అమ్మకాలు అమాంతం పెరిగాయి. దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు తగ్గడం, బంగారం ధరలు కొన్ని రోజులుగా పతనం అవుతూ ఉండటంతో బంగారం ధరలు మరింత తగ్గిపోతాయేమోనన్న భయంతో కొందరు తమ పాత బంగారాన్ని అమ్మేస్తున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును ప్రజలు సీరియస్గా తీసుకున్నారని ఈ పరిణామాలను కొందరు విశ్లేషిస్తుంటే.. మరికొందరు మాత్రం పాత బంగారం అమ్మకాలు ఎప్పుడూ జరిగేవనని అంటున్నారు. అయితే.. ఇంట్లో ఉన్న బంగారం అమ్మాలనే నిర్ణయం స్వల్పకాలిక ధరల తగ్గుదల అనే అంశంపై కాకుండా వ్యక్తిగత ఆర్థిక అవసరాలపై ఆధారపడి ఉండాలని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు.
►ALSO READ | చెన్నై, బెంగళూరు, విజయవాడ వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్.. ఈ ట్రిక్ తెలిస్తే సీట్ గ్యారెంటీ
ఇండియాలోని ప్రజల ఇళ్లలో దాదాపు 30 వేల టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా. 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం లక్షా 43 వేల పైనే ఉంది. అయితే.. ఈ ధరలు మరింత తగ్గి లక్షా 20 వేలకు తులం బంగారం ధర పడిపోవచ్చని బులియన్ మార్కెట్లో అంచనాలున్నాయి. దీంతో.. పాత ఆభరణాలను ఉంచుకోవడం కంటే వాటిని నగదుగా మార్చుకోవడం మేలు అని మన దేశంలోని చాలా కుటుంబాలు పాత బంగారాన్ని అమ్ముతుండటం గమనార్హం.
రికార్డు స్థాయిల నుంచి బంగారం ధరలు సుమారు రూ. 30 వేలు తగ్గినప్పటికీ, సాధారణ వినియోగదారుడికి ఇంకా భారంగానే ఉన్నాయి. రూ. లక్షా 45 వేల ధర పెట్టి కొనుగోలు చేయాలంటే వెనకడుగు వేస్తున్నారు. అయితే.. ఆషాఢ మాసం ముగిసి, శ్రావణ మాసం నోములు, రాబోయే పండగల సీజన్ ప్రారంభమైతేనే మార్కెట్ మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకునే అవకాశం ఉంది.
