యూరప్ గ్లోబల్ వార్మింగ్ కోరల్లో చిక్కుకున్నది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఖండాన్ని అతలాకుతలం చేస్తున్న భీకర ‘హీట్‌వేవ్’ (తీవ్ర వడగాలులు) అక్కడి జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. సూర్యుడు నిప్పుల కొలిమిలా మారుతుండటంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి తీవ్రతకు ఏకంగా రైల్వే పట్టాలు దెబ్బతినడం, రోడ్లు కరిగిపోతుండటం చూస్తుంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పలు దేశాల్లో భానుడి భగభగలు ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటేయడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పశ్చిమ యూరప్‌లో మొదలైన ఈ నిప్పుల తుఫాను.. క్రమంగా సెంట్రల్, ఈస్ట్రన్ యూరప్ దేశాలకూ విస్తరించింది. దశాబ్దాల కాలం నాటి ఉష్ణోగ్రతల రికార్డులన్నీ ఇప్పుడు తుడిచిపెట్టుకుపోతున్నాయి. డెన్మార్క్‌లో ఏకంగా 1874 నాటి రికార్డు బద్ధలైంది. దాదాపు 150 ఏండ్ల తర్వాత ఇప్పుడే అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. స్విట్జర్లాండ్‌లో 38.8 డిగ్రీలు, చెక్ రిపబ్లిక్‌లో 40.8 డిగ్రీలతో ఆల్‌టైమ్ రికార్డులు నమోదయ్యాయి. బ్రిటన్‌లో జూన్ నెల చరిత్రలోనే అత్యధికంగా 37.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.
ఎండల తీవ్రతకు కారణం ‘హీట్ డోమ్’ ప్రభావమేనా..!
జూన్ నెలలోనే ఈ స్థాయిలో రికార్డులు బద్ధలు కావడానికి వాతావరణంలో ఏర్పడిన ‘హీట్ డోమ్’ ప్రభావం ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నా రు. ఈ వాతావరణ వ్యవస్థలో వేడి గాలి పైకి పోకుండా వాతావరణం కిందికి నొక్కి ఉంచుతుంది. అది భూమిని తాకినప్పుడు మరింతగా సంకోచించి విపరీతంగా వేడెక్కుతుంది.
ఈ ప్రక్రియ వల్ల మేఘాలు ఏర్పడే అవకాశం లేకపోవడంతో, తీవ్రమైన సూర్యరశ్మి నేరుగా భూమిని తాకి ఉష్ణోగ్రతలను అసాధారణ స్థాయికి పెంచేస్తుంది. వాతావరణ మార్పుల వల్లే ఈ విపత్తు సంభవిస్తోందని, ఒకప్పుడు ‘తరానికి ఒకసారి’ వచ్చే ఇలాంటి వడగాలులు.. ఇప్పుడు ప్రతి ఏటా వస్తున్నాయని డబ్ల్యూహెచ్‌వో అధినేత టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వేసవి వడగాలులు వందలాది అదనపు మరణాలకు కారణమవుతున్నాయని అన్నారు. యూరప్ ప్రస్తుత పరిస్థితులపై ‘ఎక్స్’ వేదికగా టెడ్రోస్ స్పందించారు. ‘‘వేడి వల్ల వచ్చే శారీరక ఒత్తిడిని (హీట్ స్ట్రెస్) తరచుగా ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు. యూరప్‌లోని ఇళ్లు, ఆఫీసులు, స్కూళ్లు ఇంతటి భారీ ఉష్ణోగ్రతలను తట్టుకునేలా నిర్మించలేదు” అని ఆయన వ్యాఖ్యానించారు. మిలియన్ల మంది ప్రజలు ప్రస్తుతం తీవ్రమైన వేడి కింద బతుకుతున్నారని, వందలాది మంది మరణించారని, పాఠశాలలు మూతపడ్డాయని, పవర్ గ్రిడ్‌లు కుప్పకూలుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
