మహిళా ఎస్సైని ఒక ఎమ్మెల్యే కూతురు కొట్టిన ఘటన కర్ణాటకలో సంచలనంగా మారింది. నేనొక ఎమ్మెల్యే కూతురును.. నన్నే ఆపుతావా.. ఎన్ని గుండెలు నీకు.. నీ జాబ్ ఎలా ఉంటుందో నేను చూస్తా.. అయిపోయింది.. నీ పని అయిపోయింది.. అంటూ ఎస్సై ని తిట్టడమే కాకుండా ఘోరంగా కొట్టి అవమానించారని కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
శ్రీరంగపట్న తాలుకాలోని ఆరథి ఉక్కాడా టెంపుల్ కు.. సిట్టింగ్ బీజేపే ఎమ్మెల్యే కూతురు వెళ్లిందట. మాంద్య మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై బి.సవిత ఆ టైమ్ లో డ్యూటీలో ఉందట. భీమా మావాస్య సందర్భంగా డ్యూటీలో ఉండగా.. 2026. ఆగస్టు 12 సాయంత్రం 8.15 గంటలకు ఈ ఘటన జరిగింది.
ఫిర్యాదు ప్రకారం.. తుమకూరు రూరల్ ఎమ్మెల్యే బి.సురేష్ గౌడ కూతురు, ఏసీపీ గౌతమ్ భార్య అయిన ఐశ్యర్య.. తనను దర్శనానికి వెంటనే అనుమతించలేదని ఎస్సైతో వాగ్వివాదానికి దిగింది.
కంప్లైంట్ ప్రకారం.. ఐశ్యర్య ఎస్సైని బూతులు తిట్టి అవమానించడమే కాకుండా.. చెంపకెట్టి కొట్టింది. అంతే కాకుండా.. డ్యూటీ నుంచి తీసేయిస్తానని దారుణంగా బెదిరించింది.
డ్యూటిలో ఉన్న పోలీసుపై దాడి చేసుకున్న ఐశ్యర్యపై క్యాతనపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇక్కడ ట్విస్టేంటంటే.. వాదన సందర్భంగా పోలీసే ముందుగా తనను అవమానించిందని కౌంటర్ కంప్లైంట్ నమోదైనట్లు మాండ్య ఎస్పీ పేర్కొన్నారు.
క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే:
ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే సురేష్ గౌడ క్షమాపణ చెప్పారు. తన కూతురు ఇద్దర పిల్లలతో కలిసి దేవాలయానికి వెళ్లిందని.. దర్శనానికి గర్భగుడిలోకి వెళ్లేందుకు అనుమతి కోరిందని ఎమ్మెల్యే చెప్పారు. సీఐ పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఎస్సై మాత్రం అనుమతించలేదని.. అదే సమయంలో ఎస్సై అగౌరవంగామాట్లాడినట్లు చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య వాదన జరిగిందని.. అది భౌతిక దాడికి దారితీసిందని చెప్పారు.
తన కూతురు ఎస్సైని కొట్టిన వీడియో చూడలేదని.. కానీ ఈ విషయంలో క్షమాపణ చెబుతున్నానని ఆయన తెలిపారు.
