పోస్టాఫీస్.. పోస్టల్ సేవల గురించి మనకు తెలిసిందే.. పోస్టాఫీస్ అంటే ఒకప్పుడు ఉత్తరాలు, టెలిగ్రామ్‌లు, ట్రంక్ కాల్స్.. ఇప్పుడు అదే పోస్టల్ వ్యవస్థ టెక్నాలజీతో కొత్త రూపం సంతరించుకుంటోంది. కాలం మారడంతో సంప్రదాయ పోస్టల్ సేవలకు ప్రాధాన్యత తగ్గుతున్నా.. ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పోస్టల్ వ్యవస్థను అప్డేట్ చేస్తోంది. ఇందులో భాగంగా డాక్ మెయిల్ సర్వీస్‌ను విస్తరిస్తూ.. ఇప్పుడు డ్రోన్ల ద్వారా పార్సిళ్లను చేరవేసే సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. రోడ్డు మార్గాలు చేరుకోలేని మారుమూల ప్రాంతాలకు కూడా వేగంగా పోస్టల్ సేవలను అందించేందుకు ఈ డ్రోన్ సర్వీస్ కీలకంగా మారనుంది.
భారతీయ పోస్టల్ సేవల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. మారుమూల ప్రాంతాలకు లేఖలు, పార్సిళ్లను మరింత వేగంగా చేరవేసేందుకు అసోంలో ఇండియా పోస్ట్ తొలిసారిగా డ్రోన్లతో మెయిల్ డెలివరీని ప్రారంభించింది. రవాణా సౌకర్యం సరిగా లేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా పోస్టల్ సేవలను అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.
ఈ సేవల కోసం ఇండియా పోస్ట్ స్కై ఎయిర్ మొబిలిటీ (Skye Air Mobility) సంస్థతో టైఅప్ అయింది. అసోం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 150 డ్రోన్ మార్గాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాల్లోని బ్రాంచ్ పోస్టాఫీసులకు మెయిల్ బ్యాగులు, లేఖలు, పార్శిళ్లను వేగంగా తరలించనున్నారు.
ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్‌లోని మండి–రెహర్‌ధార్ మార్గంలో ఈ డ్రోన్ పోస్టల్ సేవలు ప్రారంభమయ్యాయి. సాధారణ రవాణా ద్వారా చేరుకోవడానికి రెండు గంటలకు పైగా టైం పట్టే 12 కిలోమీటర్ల మార్గంలో కేవలం ఏడు నిమిషాల్లో డ్రోన్ ద్వారా సర్వీస్ అందించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఈ డ్రోన్ల ద్వారా పోస్టల్ సేవలను అందించవచ్చు. అంతేకాదు మెయిల్ రవాణాను రియల్ టైమ్ లో ట్రాక్ చేసే అవకాశం కూడా ఉంది.
