గోల్డ్ కాయిన్ డెలివరీ చేయకుండా ఆర్డర్ క్యాన్సిల్ చేసిన Myntra.. కర్నూలు కోర్టు ఎంత కట్టించిందంటే?

గోల్డ్ కాయిన్ డెలివరీ చేయకుండా ఆర్డర్ క్యాన్సిల్ చేసిన Myntra.. కర్నూలు కోర్టు ఎంత కట్టించిందంటే?

మింత్రాపై కర్నూలు జిల్లా కన్జూమర్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆన్‌లైన్‌లో గోల్డ్ కాయిన్ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు దాన్ని డెలివరీ చేయకుండా.. క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా చివరకు ఆర్డర్‌ను ఏకపక్షంగా రద్దు చేసినందుకు మింత్రాను రూ.60వేలు చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో రూ.50వేలు పరిహారం, రూ.10వేలు న్యాయపరమైన ఖర్చులుగా చెల్లించాలని కమిషన్ తీర్పు ఇచ్చింది.

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి 2025 అక్టోబర్ 5న మింత్రాలో క‌ల్యాణ్ జ్యువెల్లర్స్‌కు చెందిన 24 క్యారెట్ల 5 గ్రాముల అయోధ్య గోల్డ్ కాయిన్‌ను ఆర్డర్ చేశాడు. ఇందుకోసం యూపీఐ ద్వారా రూ.59వేల 750 చెల్లించాడు. అక్టోబర్ 22లోపు డెలివరీ చేస్తామని మింత్రా హామీ ఇచ్చినా ఆ తేదీకి గోల్డ్ కాయిన్ అందలేదు.

డెలివరీ కోసం కస్టమర్ పలుమార్లు ఈమెయిల్స్, చాట్స్ ద్వారా మింత్రాను సంప్రదించాడు. అయితే గోల్డ్ ప్రొడక్ట్స్ క్యాన్సిల్ చేయడానికి వీలు లేదని మింత్రా తన రూల్స్ చూపించింది. చివరకు ఆర్డర్ చేసిన 41 రోజుల తర్వాత.. నవంబర్ 15న మింత్రానే ఆర్డర్‌ను రద్దు చేసి రూ.59వేల 730 మాత్రమే తిరిగి వెనక్కి ఇచ్చింది. అంటే చెల్లించిన మొత్తంలో రూ.20 తక్కువగా ఇచ్చింది. అలాగే ఆర్డర్ క్యాన్సిల్ చేయటానికి కారణం కూడా వివరించలేదు. 

మింత్రా తనను కేవలం థర్డ్‌పార్టీ సెల్లర్లకు, కస్టమర్‌కు మధ్య పనిచేసే మధ్యవర్తి మాత్రమేనని వాదించింది. కానీ కస్టమర్ నుంచి డబ్బు, ప్లాట్‌ఫామ్ ఫీజులు వసూలు చేసినందున మింత్రా బాధ్యత నుంచి తప్పించుకోలేదని కమిషన్ స్పష్టం చేసింది. డెలివరీ తేదీ నుంచి రీఫండ్ వరకు 23 రోజుల ఆలస్యం వల్ల బంగారం ధర పెరిగి, కస్టమర్‌కు రూ.4వేల 297 నష్టం జరిగినట్లు కమిషన్ గుర్తించింది.

ఈ వ్యవహారం సేవల్లో లోపం, అన్యాయమైన వాణిజ్య పద్ధతికి ఉదాహరణగా కమిషన్ పేర్కొంది. అందుకే మింత్రాను రూ.50వేల పరిహారం, రూ.10వేలు న్యాయపరమైన ఖర్చులు కట్టమని ఆదేశించింది. 45 రోజుల్లో చెల్లించకపోతే రూ.50వేలపై 2026 జనవరి 27 నుంచి 9 శాతం వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని తీర్పులో స్పష్టం చేసింది కన్జూమర్ కోర్టు.