సాఫ్ట్వేర్ కోడలికి సిజేరియన్ భయం.. యూట్యూబ్ చూసి పురుడు పోసిన అత్త.. ఆ తర్వాత..

సాఫ్ట్వేర్ కోడలికి సిజేరియన్ భయం.. యూట్యూబ్ చూసి పురుడు పోసిన అత్త.. ఆ తర్వాత..

చెన్నై: యూట్యూబ్లో చూసి వంటలు నేర్చుకోవచ్చు గానీ ప్రసవాలు చేస్తే ఎంత ప్రమాదమో మరోసారి రుజువు చేసిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని పుంజైత‌ళ‌వాయి పాళ్యం గ్రామంలో ఈ ఘటన జరిగింది. శశికళ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగినికి ఇప్పటికే ఒక పాప ఉంది. మొదటి ప్రసవం సి-సెక్షన్ కావడం గమనార్హం. సి-సెక్షన్కు తన కోడలు భయపడటంతో శశికళ అత్త కోడలి సహజ ప్రసవానికి ప్రయత్నం చేసింది. యూట్యూబ్ చూసి సహజ ప్రసవం చేసింది. శశికళ భర్త కూడా ఈ సహజ ప్రసవం సమయంలో ఇంట్లోనే ఉన్నాడు.

ఇంట్లోనే 32 ఏళ్ల శశికళ జూన్ 24 ఉదయం తన రెండవ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే శశికళకు తీవ్ర రక్తస్రావమైంది. రక్తం ఎక్కువ పోయింది. శశికళ కోమాలోకి వెళ్లింది. ఆమెను వెంటనే పెరుందరై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం కోయంబత్తూరులోని రాయల్ కేర్ ప్రైవేట్ ఆసుపత్రికి ఆమెను తరలించారు. శశికళను ఐసీయూలో చేర్చగా.. చికిత్స పొందుతూ ఆమె ఆదివారం (జూన్ 28) చనిపోయింది.

►ALSO READ | కెరీర్ సెట్ చేసుకోమని లవర్ చేతికి కోటి.. పెళ్లి షాపింగ్ పేరుతో కేతన్ నుంచి డబ్బు తీసుకున్న సియా !

ఈ ఘటనపై.. శశికళ భర్త కుళంతైసామి మాట్లాడుతూ, తమకు 2019లో వివాహం జరిగిందని, 2020లో శశికళకు సిజేరియన్ ద్వారా ఆడపిల్ల పుట్టిందని చెప్పాడు. అయితే.. సిజేరియన్ అయిన కొన్ని నెలల పాటు శశికళ తీవ్రమైన నడుము నొప్పితో సహా పలు సమస్యలతో బాధపడింది. అందుకే రెండో కాన్పుకు.. ఆమె ఒక్కసారి కూడా స్కానింగ్కు కూడా ఆసుపత్రికి వెళ్లలేదని శశికళ భర్త చెప్పాడు. తనతో సహా ఇంట్లో వాళ్లమంతా.. ఆసుపత్రికి వెళ్లమని ఎంత చెప్పినా ఆమె వినిపించుకోలేదని.. శశికళ ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లకూడదని నిర్ణయించుకుందని కుళంతైసామి చెప్పాడు.

జూన్ 23వ తేదీన రాత్రి శశికళకు పురిటి నొప్పులొచ్చాయి. జూన్ 24వ తేదీ తెల్లవారుజామున 5.42 గంటలకు ఆమె తన రెండవ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొద్ది నిమిషాల తర్వాత.. ఆమె తీవ్ర రక్తస్రావానికి గురై కోమాలోకి వెళ్లడంతో.. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శశికళ చనిపోయింది. పుట్టిన బిడ్డ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు.