Suriya 48: ‘జై భీమ్’ కాంబో రిటర్న్స్.. మరో పవర్‌ఫుల్ సోషల్ డ్రామాకు శ్రీకారం!

Suriya 48: ‘జై భీమ్’ కాంబో రిటర్న్స్.. మరో పవర్‌ఫుల్ సోషల్ డ్రామాకు శ్రీకారం!

‘కరుప్పు’ సక్సెస్ తర్వాత తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) మరో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ‘జై భీమ్’తో సంచలన విజయం అందించిన దర్శకుడు టీ.జె. జ్ఞానవేల్‌తో ఆయన మరోసారి చేతులు కలిపారు. ‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనుంది.

తాజాగా ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇవాళ జూన్ 29న చెన్నైలో ఈ కాంబినేషన్ కు సంబంధించిన ముహూర్తపు కార్యక్రమం ఘనంగా జరిగింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

హోంబలే ఫిలిమ్స్ హీరో సూర్యపై ప్రశంసలు కురిపిస్తూ.. ‘‘అతను నిర్మించుకున్న ప్రయాణం ఇది.. ఫ్రేమ్ తర్వాత ఫ్రేమ్.. సినిమా తర్వాత సినిమా.. పోరాటం తర్వాత పోరాటం. నిజాన్ని పలికించిన పాత్రలు.. నిజ జీవితాల భారాన్ని మోసిన పాత్రలు.. ధైర్యం, నమ్మకం, నైపుణ్యానికి ప్రతిరూపమైన ఓ సినీ ప్రయాణం. తెరపై మూడు దశాబ్దాల నిజాయితీ.. తెర దాటి కోట్లాది హృదయాలను తాకిన ప్రభావం.. ఇప్పుడు.. తన తరం లోనే అత్యంత నిర్భయ నటుడు.. తన కెరీర్‌లోనే అత్యంత భారీ వేదికపై అడుగుపెడుతున్నాడు’’ అని స్పెషల్ నోట్ పంచుకుంది. 

ఇటీవల రజనీకాంత్‌తో 'వెట్టయాన్' తెరకెక్కించిన జ్ఞానవేల్, మరోసారి ఓ సాలిడ్ కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. సామాజిక అంశాలను ప్రతిబింబించే స్ట్రాంగ్ కంటెంట్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ మేళవింపుతో ఈ చిత్రం రూపొందనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

►ALSO READ | NTRxTrivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ అనౌన్స్‌.. త్రిశూలం వెనుక దాగిన రహస్యం ఏంటి?

ఈ భారీ పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్‌గా కయాదు లోహర్ నటించనుండగా, యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా ఎస్.ఆర్. కథిర్, ఎడిటర్‌గా ఫిలోమిన్ రాజ్ పనిచేయనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ మరియు రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.